Monday, January 20, 2025

మూఢ నమ్మకాల మత్తు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో మూఢ నమ్మకాల మత్తులో ప్రజలు మునిగిపోతున్నారు. చేతబడి, దిష్టి, తొక్కు డు అంటూ కొత్త కొత్త పేర్లతో భయాందోళనకు గురవుతున్నారు. ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకొని కొంత మంది మంత్రాల నెపంతో లక్షలకు లక్షలు సంపాదించుకుం టున్నారు. క్షుద్ర పూజలు చేయాలంటూ అర్ధరాత్రి, తెల్లవారుజామున పసుపు, కుంకుమ, టెంకాయలు, గుమ్మడి కాయ, నిమ్మ కాయ, ఊదు, అగరవత్తులు, అగ్నిగుండాలను తయారు చేసి అమాయకుల నుండి అధిక మొత్తాల్లో డబ్బులు తీసుకుంటూ మోసం చేస్తున్నారు. కొంత మంది దేవుని కళ్యాణం, దేవతను ప్రతిష్టించడం లాంటి దానికి డబ్బు కాకుండా బంగారం, వెండి తీసుకుంటూ అందిన కాడికి దోచుకుంటున్నారు.

శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక, పారిశ్రామిక, విద్య, వైద్య నిపుణులు ఎంతో అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోని పల్లె, పట్నం తేడా లేకుండా మూఢ నమ్మకాల మత్తులో మునిగిపోతున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ మూఢ నమ్మకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ నగరం కాస్మోపాలిటన్ సిటీగా, హైటెక్ నగరంగా, మినీ భారతంగా, గ్లోబల్ సిటీగా పిలువబడుతున్నప్పటికీ నగరంలో విద్యావంతుల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ మూఢ నమ్మకాలు మాత్రం తగ్గలేదు. మసీదుల దగ్గర, దర్గాల దగ్గర, కొన్ని మార్కెట్ ప్రాంతాలలో, కొన్ని ప్రాంతాలలో అనేక మంది చిన్న పిల్లల తల్లిదండ్రులు క్యూ లైన్లు కట్టి తమ పిల్లలకు తాయత్తులను కట్టించుకునే దృశ్యాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రజల బలహీనత మంత్రాల పేరుతో కొంత మంది మోసకారులకు లాభంగా మారుతుంది.

జ్వరాలు, తల నొప్పులు, వళ్ళనొప్పులు, నరాల బలహీనతను ఆసరాగా చేసుకొని మంత్రాల పేరుతో కొంత మంది డబ్బులను సంపాదించుకున్నారు. ఓల్డ్ సిటీలోని కొన్ని సున్నితమైన ప్రాంతాలలో మూఢ నమ్మకాల పేరుతో మోసం చేసే వారి ఆగడాలకు, అరాచకాలకు అడ్డుఅదుపు లేకుండాపోతుంది. మూఢ నమ్మకాల పేరుతో మోసం చేస్తున్నవారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ దానిని అమలు చేసే నాథుడే లేరని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని అనేక ప్రాంతాలలో కుల, మతాలకు అతీతంగా పావురాలకు గింజలు వేస్తే పుణ్యం వస్తుందని మూఢ నమ్మకాలతో అనేక మంది పావురాలకు గింజలు వేస్తున్నారు.

కొంత మంది వ్యాపారం చేస్తూ గింజలను విక్రయిస్తున్నారు. నూకలు, జొన్నలు, సజ్జలు, గోధుమలు, మొక్కజొన్న గింజలు కలిపి అమ్ముతూ అధిక మొత్తాల్లో డబ్బులను సంపాదించుకుంటున్నారు. పావురాలకు సహజ గుణం ఎగురుతూ దానికి కావలసిన ఆహార పదార్థాలను సంపాదించుకోవడం. ప్రజల మూఢ నమ్మకాల వలన పావురాలకు గింజలు వేయడం వల్ల అవి ఎగిరే సహజత్వానికి దూరమవుతున్నా యి. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు అధికారులు దృష్టి కేంద్రీకరించి అమాయక ప్రజలను మూఢ నమ్మకాల పేరుతో మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

ఎస్. విజయ భాస్కర్- 9290826988

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News