క్వీన్స్ లాండ్ ప్రభుత్వ ప్రతినిధులను కోరిన మంత్రి శ్రీధర్ బాబు
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న ‘ఏఐ సిటీ’లో పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా – క్వీన్స్ లాండ్ ప్రభుత్వ ప్రతినిధులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. క్వీన్స్ లాండ్ రాష్ట్ర ఫైనాన్స్, ట్రేడ్, ఎంప్లాయ్ మెంట్ అండ్ ట్రైనింగ్ మంత్రి ‘రాసిన్ బేట్స్’ ఆధ్వర్యంలోని బృందం సోమవారం బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ-క్వీన్స్‌లాండ్’ మధ్య ప్రాధాన్య రంగాల్లో సంబంధాలను మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. త్వరలో రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ గురించి ప్రత్యేకంగా వివరించామన్నారు.
జీవ విజ్ఞానం, ఔషధ తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్న తెలంగాణతో కలిసి పని చేసేందుకు ప్రతినిధుల బృందం ఆసక్తి వ్యక్తం చేసిందన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే క్రీడా విశ్వ విద్యాలయానికి సహకరించాలని కోరగా అంగీకరించారన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటును ప్రత్యేకంగా అభినందించారని, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన కోర్సులపై బృంద సభ్యులు ఆసక్తి వ్యక్తం చేశారన్నారు.
రాబోయే రోజుల్లో తాము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పారన్నారు. అంతర్జాతీయ స్థాయిలో విద్య, ఆర్‌అండ్ డీ, వ్యవసాయం తదితర అంశాల్లో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. కార్యక్రమంలో క్వీన్స్ లాండ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ సీఈవో జస్టిన్ మెక్ గవాన్, ఆస్ట్రేలియన్ కాన్సుల్ జనరల్(బెంగళూర్) హిల్లరీ మెక్ గెచీ, ఆస్ట్రేలియన్ కాన్సుల్ జనరల్(బెంగళూర్) కన్సల్ ఆండ్రయా కాలిస్టర్, పాలసీ రీసెర్చ్ అసోసియేట్ కృతికా సుబ్రహ్మణ్యన్, ట్రేడ్ కమిషనర్ అభినవ్ భాట్ల, మనీష్ శర్మ తదితరులు పాల్గొన్నారు.