Wednesday, January 22, 2025

దిశ ఎన్‌కౌంటర్ ఘటనపై హైకోర్టులో విచారణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దిశ ఎన్‌కౌంటర్ ఘటనపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపింపించారు. ఎన్‌కౌంటర్ బాధితుల తరపున హైకోర్టులో లాయర్ కృష్ణమాచార్య వాదించారు. ప్రభుత్వం తరపున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని అన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు ఈ కేసు విచారణకు జూన్ 21వ తేదీకి వాయిదా వేసింది. దిశ ఎన్‌కౌంటర్ సమయంలో పోలీసు కమిషనర్‌గా ఉన్న విసి సజ్జనార్ ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో విసి సజ్జనార్‌కి కూడా హైకోర్టు నోటీస్ జారీ చేసింది.

దిశ గ్యాంగ్ రేప్, మర్డర్ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో నిందితులను ఏ పరిస్థితుల్లో ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చింది, అసలు ఈ ఎన్‌కౌంటర్ ఎలా జరిగింది అనే వివరణ ఇవ్వాల్సిందిగా హైకోర్టు ఆ నోటీసుల్లో స్పష్టం చేసింది. ఈ ఎన్‌కౌంటర్‌లో తమ తప్పు లేదనే విషయాన్ని తగిన సాక్ష్యాధారాలతో నిరూపించుకోవాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా లాయర్ కృష్ణమాచార్య మాట్లాడారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న 10 మంది పోలీసులకు హైకోర్టు నోటీసు ఇచ్చిందని అన్నారు. ఎన్‌కౌంటర్ సమయంలో సిపిగా ఉన్న సజ్జనార్ నోటీస్ అందుకున్నారని పేర్కొన్నారు. నోటీసులో తమ వాదన వినిపించాలని హైకోర్టు పేర్కొందని తెలిపారు.

మరోవైపు ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై సెక్షన్ 302 ప్రకారం కేసు పెట్టాలని హైకోర్టు కోరామని తెలిపారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని కూడా కోరినట్లు ఆయన వెల్లడించారు. హైకోర్టు నష్టపరిహారం అంశంలో సానుకూలంగా ఉన్నట్టు అనిపిస్తోందని చెప్పారు. దిశ కేసు తుది ఘట్టానికి చేరుకున్నట్టు తెలుస్తోందని, మరో రెండు వాయిదాల్లో తీర్పు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News