హైదరాబాద్: నార్సింగి డ్రగ్స్ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులు లావణ్య గురించి ఆసక్తి కర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లావణ్యను కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటికి వస్తాయని పోలీసులు కోర్టులో పిటీషన్ వేశారు. లావణ్యను ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. ఎపిలోని విజయవాడుకు చెందిన లావణ్య ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నటనపై ఆసక్తి ఉండడంతో షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఈ సమయంలోనే పలువురు సినీ నటులతో పరిచయం ఏర్పడింది. టాలీవుడ్‌లో నటింందుకు ప్రయత్నం చేసే క్రమంలోనే ఓ టాలీవుడ్ హీరోతో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరు ప్రేమికులుగా మారారు, ఈ విషయం నార్సింగి పోలీసుల విచారణలో తెలిసింది. చిన్న చిన్న సినిమాల్లో లావణ్య నటించింది, మరోవైపు సంగీతం టీచర్‌గా పనిచేస్తోంది. ఫిల్మ్స్‌లో నటించే సమయంలో జల్సాలకు అలవాటుపడి డ్రగ్స్ విక్రయించడం మొదలు పెట్టింది.
గత కొంత కాలం నుంచి కోకాపేటలో నివాసముంటున్న లావణ్య డ్రగ్స్ దందా చేస్తున్నట్లు మాదాపూర్ ఎస్‌ఓటి పోలీసులకు సమాచారం అందింది. డంతో ఆదివారం సాయంత్రం శంకర్పల్లి-నార్సింగి రహదారిలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా 4 గ్రాముల ఎండీఎంఏ లభించింది. ఆమె కొన్ని రోజులుగా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. పరిచయస్థుడైన ఉనీత్రెడ్డి ఎండీఎంఏను తన బ్యాగులో వేశాడని ఆమె చెప్పారు. అతడు గతంలో డ్రగ్స్ వినియోగిస్తూ మోకిల పోలీసులకు చిక్కాడు. ఆ తర్వాత విక్రేతగా మారి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఉనీత్రెడ్డితో పాటు ఇందూ అనే మరో మహిళ పరారీలో ఉన్నారు. కొంత కాలం నుంచి లావణ్య, ఉనిత్ ద్వారా గోవా నుంచి డ్రగ్స్ తెప్పించుకుని ఇక్కడ గ్రాముకు రూ.6,000లకు విక్రయిస్తున్నట్లు తెలిసింది.
సినీ ఇండస్ట్రీపై ప్రత్యేక నిఘా…
టాలీవుడ్‌ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద భూతాల్లో ‘డ్రగ్స్ దందా’ ఒకటి. దీనిని ఇండస్ట్రీ నుంచే కాదు, తెలంగాణ నుంచే పూర్తిగా నిర్మూలించాలని అధికారులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా టాలీవుడ్‌లో డ్రగ్స్ వాడుతున్న వారిపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు. సినీ పరిశ్రమకు చెందిన కొందరు వ్యక్తులు డ్రగ్స్ దందాను అత్యంత రహస్యంగా నడుపుతున్నారని పోలీసులకు కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. పోలీస్ అధికారులు ఇండస్ట్రీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నార్సింగిలో ఇద్దరు నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరిలో ఒకరు లావణ్య, ఉనీత్ రెడ్డి, వీరితోపాటు మరో మహిళ కూడా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులకు తెలిసింది.
వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో అనుమానితురాలుగా ఉన్న లావణ్య. చిత్ర పరిశ్రమలో పలువురికి డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లావణ్య సోషల్ మీడియా అకౌంట్‌లతో పాటు వ్యక్తిగత చాట్‌ని సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు. లావణ్యకు చాలామంది విఐపిలతో పరిచయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. లావణ్యను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు. కస్టడీలో మరిన్ని విషయాలు బయటికి వస్తాయని, లావణ్య వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసిన వారి వివరాలు తెలిస్తే వారిని కూడా అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు.