డెహ్రాడూన్: కేదార్‌నాథ్ ఆలయం బంగారు తాపడం ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, రూ.125 కోట్ల వరకు కుంభకోణం జరిగిందని వచ్చిన ఆరోపణలపై ఉన్నతస్థాయి కమిటీచే దర్యాప్తు చేయించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి సత్పాల్ మహరాజ్ శుక్రవారం దీని గురించి మాట్లాడుతూ గర్‌వాల్ కమిషనర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల కార్యదర్శి హరిశ్చంద్ర సెమ్వాల్‌ను ఆదేశించినట్టు శుక్రవారం వెల్లడించారు.
సాంకేతిక నిపుణులతోపాటు స్వర్ణకారులు కమిటీలో ఉండాలని ఆయన సూచించారు. ఈ ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, దోషులు ఎవరో తేలితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి వివరించారు. శ్రీబద్రీనాథ్ కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చట్టం 1939 ప్రకారం విరాళాలు అంగీకరించవచ్చునని, బంగారు తాపడం పనులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని వివరించారు. భారత పురావస్తుశాఖ నిపుణుల ఆధ్వర్యం లోనే పనులు జరిగాయన్నారు. గర్భగుడిలో బంగారు పూత పూయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాత అనుమతి తీసుఉన్నారని స్పష్టం చేశారు.
ఇందులో ఆలయ కమిటీ ఎలాంటి జోక్యం చేసుకోలేదని చెప్పారు. ఈ పని పూర్తయ్యాక సంబంధిత బిల్లు, ఇతర పత్రాలు ఆలయ కమిటీకి సమర్పించారని చెప్పారు. అయితే చార్‌థామ్ యాత్రకు ఆటంకం కలిగించాలనే విపక్షాలు ఇలాంటి లేనిపోని ఆరోపణలతో ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు. ఆలయ గర్భ గుడిలో 23,777.800 గ్రాముల బంగారాన్ని ఉపయోగించినట్టు గతంలో ఆలయ కమిటీ వెల్లడించింది. ప్రస్తుతం దీని విలువ రూ. 14.38 కోట్లు. పూత పూసిన రాగి పలకల మొత్తం బరువు 1001. 300 కిలోలు కాగా, దీని విలువ రూ. 29 లక్షలు. కేదార్‌నాథ్ ఆలయ పూజారి, చార్‌థామ్ మహాపంచాయత్ ఉపాధ్యక్షులు సంతోష్ త్రివేది సోషల్ మీడియా ద్వారా ఆరోపణలు చేశారు. గర్భగుడి గోడలపై బంగారు పూతకు బదులు ఇత్తడిని ఉపయోగించారని, ఈమేరకు రూ. 1.25 కోట్ల వరకు కుంభకోణం జరిగిందని ఆరోపించారు