న్యూఢిల్లీ: అవినీతి కేసులో ప్రభుత్వ అధికారిపై దర్యాప్తు చేపట్టడానికి సంబంధిత అథారిటీ నుంచి ముందుగా అనుమతి తీసుకోవడాన్ని తప్పనిసరి చేస్తున్న అవినీతి నిరోధక చట్టంలోని నిబంధన రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలయిన ఓ పిటిషన్‌పై వాదనలను నవంబర్ 20న వింటామని సుప్రీంకోర్టు తెలిపింది. జస్టిస్ బి నాగరత్న, జస్టిస్ ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. ఈ పిటిషన్ అత్యంత ముఖ్యమైన అంశానికి సంబంధించినదని
పిటిషన్ వేసిన స్వచ్ఛంద సంస్థ ‘సెంటర్ ఫర్ పబ్లిక్ లిటిగేషన్( సిపిఐఎల్) తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చెప్పారు. ప్రభుత్వంనుంచి ముందస్తు అనుమతి లేకుండా ఏ అవినీతి కేసులోను విచారణ జరపకూడదన్న అవినీతి నిరోధక చట్టానికి చేసిన సవరణను ఇది సవాలు చేస్తోందని ఆయన చెప్పారు. కాగా పిటిషన్‌పై తన అభిప్రాయాన్ని తెలియజేయాలంటూ సుప్రీంకోర్టు 2018 నవంబర్ 26న కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. కాగా శుక్రవారం దీనిపై విచారణ జరిపిన బెంచ్ తదుపరి విచారణను నవంబర్ 20కి వాయిదా వేసింది.