మిత్ర ధర్మం మాటలతో చైనా స్పందన
బీజింగ్: కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడిపై చైనా నిర్మాణాత్మక రీతిలో స్పందించింది. ఈ ఉదంతంపై త్వరితగతి, సమగ్ర సముచిత విచారణ జరగాలి. నిజానిజాల నిగ్గు తేలాల్సి ఉందని పేర్కొన్న చైనా ఈ విషయంలో పాకిస్థాన్‌ను సమర్ధించింది. పాకిస్థాన్‌కు తమ దేశ సర్వసత్తాకతను చాటుకునే , కాపాడుకునే హక్కు ఉందని తెలిపింది. ఒక దేశంలో అంతర్గత పరిణామాలు, ఘటనలపై ఇతర దేశాలను నిందించడం జరిగితే , ఈ విమర్శలు నిజమా కావా? అనేది ముందుగా నిర్థారించుకుని తీరాలని ఈ దశలో చైనా తమ దేశపు సర్వ వేళల మిత్రపక్షం అయిన పాకిస్థాన్‌కు బాసటగా నిలిచేందుకు రంగంలోకి దిగింది.
అయితే పహల్గాంలో జరిగిన నరమేధం వెనుక ఉన్న శక్తులుగురించి నిజాలు తెలియాల్సి ఉంది. దీనికి సమగ్రమైన దర్యాప్తు జరగాలి. ఇది వేగవంతం కావాల్సి ఉందని చైనా తెలిపింది. భారత్ పాకిస్థాన్ మధ్య ప్రస్తుత తీవ్రస్థాయి ఉద్రిక్తత వాతావరణం సమసిపోయేందుకు, సామరస్య ధోరణి ప్రబలేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నా, వాటిని అంతా స్వాగతించాలి. ఈ విషయంలో చైనా వైఖరి సుస్పష్టం అని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి గుయో జయాకున్ మీడియాతో సమావేశంలో తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి విషయాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. దర్యాప్తులో చైనా పాత్ర ఉంటుందని రష్యా మీడియా వెలువరించిన వార్తలపై స్పందించేందుకు ఈ ప్రతినిధి నిరాకరించారు.