మన తెలంగాణ/హైదరాబాద్ : సోషల్ మీడియా కేసులో విచారణకు రావాలని కడప ఎంపి అవినాష్‌రెడ్డి పిఎ రాఘవరెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. వైసిపి సోషల్ మీడియా కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న రాఘవరెడ్డి నెల రోజులుగా పరారీలో ఉన్నాడు. కడప కోర్టులో ముందస్తు బెయిల్‌కోసం పిటిషన్ దాఖలు చేయగా కోర్టు కొట్టేసింది. ఆ తర్వాత హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నెల 12 వరకు రాఘవరెడ్డిని అరెస్టు చేయవద్దని విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నిందితుడు రాఘవరెడ్డి ఆదివారం పులివెందులలో ప్రత్యక్షమయ్యాడు. విషయం తెలుసుకున్న పులివెందుల పోలీసులు విచారణకు రావాలని అతడి ఇంటికి వెళ్లారు. మౌఖికంగా చెబితే రానని, నోటీసు ఇస్తేనే విచారణకు వస్తానని రాఘవరెడ్డి పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
ఎలాంటి చర్యలు తీసుకోము, విచారణకు సహకరించాలని పోలీసులు పలుమార్లు కోరినా రాఘవరెడ్డి మాత్రం నోటీసు ఇస్తేనే విచారణకు వస్తానని స్పష్టం చేశారు. దీంతో చేసేది లేక పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్తారు. ప్రస్తుతం వర్రా రవీందర్‌రెడ్డి కేసులో పవన్ కుమార్ అనే వ్యక్తిని డిఎస్పీ మురళి ప్రశ్నిస్తున్నారు.