Wednesday, January 22, 2025

విజయనగరం రైలు ప్రమాదంపై విచారణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఇటీవల విజయనగరం జిల్లా కంటకాపల్లి దగ్గర జరిగిన ఘోర రైలు ప్రమాదంపై రైల్వే సేఫ్టీ కమీషనర్ విచారణ చేపట్టారు. బుధవారం విశాఖ డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో ఈ విచారణ ప్రారంభమైంది. తొలుత డివిజన్ పరిధిలోని లోకో పైలట్లు, వివిధ శాఖల సిబ్బంది విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకో పైలట్లు తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించారు. ఆటో సిగ్నల్ వ్యవస్థ పనితీరుపై సేఫ్టీ కమీషనర్ వివరాలు సేకరిస్తున్నారు. గురువారం మరికొందరు సాక్షులను రైల్వే సేఫ్టీ అధికారులు విచారించ నున్నారు. ఇకపోతే ఆదివారం విజయనగరం జిల్లా అలమండ – కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం నిలిచి వున్న రైలును వెనుక నుంచి వచ్చిన విశాఖ – రాయగడ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 5 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 14 మంది ప్రాణాలు కోల్పోగా 50 మందికి పైగా గాయపడ్డారు.వెంటనే స్పందించిన రైల్వే, ఎన్‌డిఆర్‌ఎఫ్, అగ్నిమాపక, పోలీస్, వైద్య సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

క్షతగాత్రులను విజయనగరం, విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల్లోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సిగ్నల్ లోపం కారణమా, మానవ తప్పిదం కారణమా? అనే చర్చ మొదలైంది. ఈ ఘటనపై ప్రధాని మోడి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 సహాయం ప్రకటించారు. “బాధితులకు అధికారులు అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తున్నారు. ప్రధాన మంత్రి మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు” అని ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్(ట్విట్టర్)లో పేర్కొంది.అయితే భారత రైల్వేలో ఇటీవల చోటుచేసుకున్న ప్రమాదాలు ప్రయాణికులు భద్రతపై ఆందోళనను రెకేత్తిస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌లో ఒడిశాలో జరిగిన ఘోర ప్రమాదంలో 280 మంది ప్రయాణికులు మరణించారు. షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఓ గూడ్స్ రైలు జూన్ 2న బహనాగ బజార్ స్టేషన్ సమీపంలో ప్రమాదానికి గురైన సంగతి విదితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News