మొత్తం మూడు కేసులు నమోదు
తెలుగు అకాడమీ కార్యాలయంలో త్రిసభ్య
కమిటీ తనిఖీలు బ్యాంకుల ఉద్యోగులను ప్రశ్నించిన సిసిఎస్ పోలీసుల దర్యాప్తు విభాగం
మనతెలంగాణ/ హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీలో నిధులు గోల్‌మాల్ కేసులో సిసిఎస్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. యూనియన్ బ్యాంకు సంతోష్‌నగర్ బ్రాంచ్‌లో ఉన్న తెలుగు అకాడమీ ఎఫ్‌డిలు కూడా రూ.8 కోట్లు మాయమయ్యాయని అకాడమీ అధికారులు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెరసి తెలుగు అకాడమీలో సుమారు రూ. 63 కోట్ల రూపాయలు గోల్ మాల్ అయినట్లు సిసి ఎస్ పోలీసులకు మొత్తం మూడు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో సిసిఎస్ పోలీసులు దర్యాప్తు భాగంగా యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్‌బిఎల్ బ్యాంక్, అగ్రాసేన్ బ్యాంకు ఉద్యోగులతో పాటు తెలుగు అకాడమీ అధికారులను ప్రశ్నించారు. నిధుల బదలాయింపులో అగ్రసేన్ బ్యాంకుతో పాటు రత్నాకర్ బ్యాంకు ప్రతినిధుల పాత్రపై పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
యూనియన్ బ్యాంక్ నుంచి బదిలీ అయిన నిధులు మొత్తం ఒకే అకౌంట్‌కు చేరినట్టుగా గుర్తించారు. తెలుగు అకాడమీ, యూనియన్ బ్యాంక్ మధ్య ఏజెంట్లుగా వ్యవహరించిన వ్యక్తుల గురించి పోలీసులు ఆరాతీస్తున్నారు. కార్వాన్ బ్రాంచ్ నుంచి రూ.43 కోట్లు, సంతోష్‌నగర్ బ్రాంచ్ నుంచి రూ.10 కోట్లు, చార్మినార్ బ్యాంకు నుంచి రూ. 10 కోట్లు బదిలీ అయినట్టు పోలీసులు నిర్ధారించారు. ఇదిలావుండగా సంతోష్‌నగర్‌లోని యూనియన్ బ్యాంక్ నుంచి రూ.8 కోట్లు గోల్‌మాల్‌లో బ్యాంక్ మేనేజర్‌తోపాటు అకాడమీ అధికారుల హస్తం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే యూనియన్ బ్యాంక్ మేనేజర్‌పై ఉన్నతాధికారులు చర్యలు కూడా తీసుకోగా మరోవైపు ముగ్గురు సభ్యులతో కూడిన శాఖాపరమైన కమిటీని ప్రభుత్వం నియమించింది.
అకాడమీలో త్రిసభ్య కమిటీ తనిఖీలు
తెలుగు అకాడమీలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల నగదు గోల్‌మాల్‌పై విచారణ ముమ్మరంగా సాగుతోంది. నిధులు మాయంపై నిగ్గు తేల్చేందుకు త్రి సభ్య కమిటీ ఆధ్యర్వంలో హిమాయత్‌నగర్‌లోని తెలుగు అకాడమీలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో అకాడమీలో పనిచేస్తున్న ఉద్యోగులను ఒక్కొక్కరినీ పిలిచి నిధుల గోల్‌మాల్ పై ఆరా తీస్తున్నారు. కమిటీ హెడ్, ఇంటర్ బోర్డు కార్యదర్శి, ఐఎఎస్ ఉమర్ జలీల్ ఆధ్వర్యంలో ప్రతీ రికార్డును అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
బ్యాంకు అధికారుల ఫిర్యాదు
తెలుగు అకాడమీలోని వ్యక్తులే వాటిని విత్‌డ్రా చేసుకున్నారంటూ యూబిఐ ఉన్నతాధికారులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలుగు అకాడమీ తమ వద్ద ఉంచిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల మొత్తం రూ.54.41కోట్లుగా బ్యాంక్ అధికారులు పోలీసులకు తెలిపారు. ఫిర్యాదులపై కేసులు నమోదు చేసుకున్న పోలీసు అధికారులు, తెలుగు అకాడమీ ప్రతినిధులను విచారించిన అనంతరం దర్యాప్తు మరింత వేగవంతం చేయనున్నారు.