Monday, December 30, 2024

అదానీ అవినీతిపై ఉలకరు.. పలకరు!

- Advertisement -
- Advertisement -

రాజ్యాంగ వ్యవస్థలను, విలువలను, కనీసమైనా ప్రజాస్వామిక, నాగరిక సంప్రదాయాలను కూలదోయడంలో, ధ్వంసం చేయడంలో సంఘ్ పరివార్ చూపుతున్న శక్తి ఆశ్చర్యం గొలుపుతున్నది. ఇంతకన్నా పతనం, దుర్మార్గం సాధ్యమా అనుకున్న ప్రతిసారీ, దిగజారడానికి మరొకమెట్టు ఉందని సంఘ్ పరివార్ చూపుతున్నది. ఈ పది సంవత్సరాలలో పార్లమెంటరీ రాజకీయ, అధికార, ఆర్థిక, విద్య, సామాజిక, సాంస్కృతిక విలువల, న్యాయ వ్యవస్థలలో ప్రతి ఒక్క దాన్నీ కనీవినీ ఎరగనంత ధ్వంసం చేసి, వాటి అసలు స్వరూపం నుంచి తారుమారు చేసి, రూపంలో యథాతథంగా కనబడుతున్నప్పటికీ సారం లో డొల్లలుగా మార్చేసిన ఘనచరిత్ర సంఘ్ పరివార్‌ది. మూడో దఫా అధికారం వచ్చిన తర్వాత మరింత నిస్సిగ్గుగా, దుర్మార్గంగా సాగనున్నదని సూచనలు కనబడుతున్నాయి. రెండో దఫా చివరిలో తన అనుంగు మిత్రుడు గౌతమ్ అదానీ అక్రమాలు బైటపడుతుండగా రక్షించడానికి ప్రారంభమయిన ఈ భారత్ తోడో కార్యక్రమం మూడో దఫా మొదట్లోనే మరొక మలుపు తిరిగి, సెబి వంటి స్వతంత్ర నియంత్రణా వ్యవస్థలను కూడా డొల్ల చేసే దిశగా ముందుకు సాగుతున్నది. 2023 జనవరిలో బైటపడిన అదానీ కంపెనీల స్టాక్ మార్కెట్ అక్రమాలలో ప్రధానమైనది. అన్నపేరుతో నడిచే కంపెనీల నుంచి తమ్ముడి కంపెనీల షేర్లలోకి అక్రమ నిధుల బట్వాడా జరిగిందనేది. దాన్ని భారత స్టాక్ మార్కెట్ పరిభాషలో రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ (సంబంధిత వ్యక్తుల లావాదేవీలు) అంటారు. అటువంటి లావాదేవీలు స్టాక్ మార్కెట్ వ్యాపారాన్ని తారుమారు చేసే, అక్రమాలతో నింపే అవకాశం ఉందని, అందువల్ల ఆ లావాదేవీలను నియంత్రించడానికి, అడ్డుకోవడానికి, ఆంక్షలు విధించడానికి స్వతంత్ర సంస్థ అవసరమనే భావనతో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ ఛేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) అనే నియంత్రణా సంస్థ ఏర్పడింది. భారత పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పడిన ఈ చట్టబద్ధ సంస్థ కర్తవ్యం ప్రజల తరపున చిన్న మధ్యతరగతి మదుపుదారుల ప్రయోజనాలు రక్షించడం. స్టాక్ మార్కెట్ దిగ్గజాలు, కార్పొరేట్ సంస్థలు, సంపన్నులు తమ ఆర్థిక బలాన్ని ఉపయోగించి స్టాక్ మార్కెట్‌ను అల్లకల్లోలం చేయకుండా, చిన్న మదుపుదార్ల సంపద కొల్లగొట్టకుండా చూడడం.భారత స్టాక్ మార్కెట్ల చేసులో కార్పొరేట్ దొంగ గొడ్లుపడి నాశనం చేయకుండా భారత పార్లమెంటులో ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసిన కంచె అది. కాని ఆ కంచె దొంగ గొడ్ల మేతను చూసీచూడనట్టు ప్రవర్తిస్తున్నదని 2023 జనవరి హిండెన్ బర్గ్ నివేదిక ఆ గొడ్లు ఎక్కడ ఎట్లా మేశాయో ఉదాహరణలు చూపింది. అప్పటికి ఇంకా చేసును కాపాడవలసిన కంచె ఎందుకు కాపాడకుండా ఉండిపోయింది. అనే అమాయక ప్రశ్న దగ్గరికి మాత్రమే చేరాం. సంపద ఎక్కడి నుంచి వచ్చిందో, సక్రమ మార్గాలలో వచ్చిందో, అక్రమ మార్గాలలో వచ్చిందో చెప్పనక్కరలేని, పన్నులు చెల్లించనక్కరలేని, పన్ను రహిత దేశాలలో డొల్లకంపెనీలు పెట్టిన అన్న భారతదేశంలోని తమ్ముడి కంపెనీ షేర్లు కొని, కొన్నట్టుగా నటించి మాయచేస్తుంటే పట్టుకోవలసిన నియంత్రణా సంస్థ ఎందుకు పట్టుకోలేదు అని అప్పటి ప్రశ్న. ఆ నివేదిక బైటపడగానే దేశంలో వ్యవస్థల విధ్వంస చిహ్నాలు మరొకసారి బైటపడడం మొదలయింది. నియంత్రణా సంస్థ తన తప్పును ఒప్పుకోకపోగా బుకాయింపులు మొదలుపెట్టింది. మసిపూసి మారేడుకాయ చేసిన రెండు నివేదికలనూ సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మధ్యలో అధికారికంగా ప్రభుత్వ సంస్థలూ, అనధికారికంగా సంఘ్ పరివార్ సంస్థలూ గౌతమ్ అదానికి రక్షణ కావచాలు తయారు చేశాయి. ఆ ప్రహసనం ఒక వైపు సాగిస్తూనే, మరొకవైపు హిండెన్ బర్గ్ పరిశోధనా సంస్థకే సంజాయిషీ నోటీసులూ, బోనెక్కించే ప్రయత్నాలూ, బెదిరింపులూ సాగించాయి. మహా ఘనత వహించిన భారత ప్రభుత్వ వ్యవస్థలు. ఈ తాటాకు చప్పుళ్లకు బెదరని హిండెన్ బర్గ్ తన పరిశోధనలు కొనసాగించి తీగ లాగుతూ డొంకలో ప్రవేశించింది. అసలు కంచెకే దొంగతనంలో భాగం ఉందని సాక్ష్యాధారాలు సంపాదించి, ఈ ఆగస్టులో మరొక నివేదిక విడుదల చేసింది. ఈ కొత్త నివేదిక భారత ఆర్థిక వ్యవస్థలో అత్యంత ప్రధానమైన నియంత్రణా యంత్రాంగపు అత్యున్నతాధికారులు ఎట్లా అదానీ ప్రయోజనాలు రక్షించడానికి, పనిలో పనిగా తమ పనులు చక్కబెట్టుకోవడానికి పని చేస్తున్నారో చూపించింది. ఈ క్రమంలో ఏడాదిన్నర కింద బైటపెట్టిన ఆర్థిక అరాచకత్వాన్ని, అవినీతిని, మహా కుంభకోణాన్ని, అంతిమంగా భారత ప్రజల సంపద లూటీని ప్రభుత్వమూ, ప్రభుత్వ పక్షమూ, దాని పరివారమూ, అధికార వ్యవస్థలూ పెంచి పోషిస్తున్నాయో చూపెట్టింది.
హిందూ ఐక్యత, దేశభక్తి, దేశాన్ని శక్తిమంతం చేయడం అనే ముసుగులతో సంఘ్ పరివార్ అసలు లక్ష్యం దేశ సంపదలను అంతకంతకూ ఎక్కువగా కేంద్రీకృతం చెయ్యడం, పిడికెడు మంది ప్రయోజనాల కోసం నూట నలభై కోట్ల ప్రజల ప్రయోజనాలను బలిపెట్టడం. సమాజం మీద, వనరుల మీద, సంపద మీద కొద్ది మంది అధికారాన్ని స్థాపించే, బలోపేతం చేసే విష విద్వేష విభజన వ్యూహం అది. మనుస్మృతి, వర్ణాశ్రమ ధర్మం, హిందుత్వ బ్రాహ్మణీయ ఫాసిజం కోరుకునే వ్యవస్థ అది. దానికి సామ్రాజ్యవాద దళారీ షోకులు అడ్డుతున్న పాలన ఇది. తెల్లవారి లేస్తే ఇడి, సిబిఐ అంటూ హడావుడి చేసేవారు కన్నంలో దొంగలా దొరికిన అదానీ గ్రూపు అవినీతిని ఎందుకు విస్మరిస్తున్నట్టు? అదానీ గ్రూపు షేర్ల మాయాజాలం చేసినట్టు ఎన్నికల ముందు హిడెన్‌బర్గ్ నివేదిక వచ్చింది. దానిపై విచారణ జరిపించాలని ఎంతగా కోరినా, పార్లమెంటు స్తంభించిపోయినా మోడీ సర్కారులో చలనం రాలేదు. సుప్రీం కోర్టు కూడా ‘సెబి’కి అప్పగించి వారి నివేదికతో సరిపెట్టింది. కానీ ఇప్పటికీ పూర్తి విచారణ జరిపి అన్నీ బయటపెట్టింది లేదు. ఈలోగా అన్నీ సర్దుబాటు చేసుకున్న అదానీ కంపెనీ వ్యాపారాలు వాటాల అమ్మకం మళ్లీ ఊపందుకున్నట్టు కథనాలు వచ్చాయంటే అంతా ఏలినవారి చలవే. తెలుగు రాష్రాల్లో కూడా ఈమధ్య కాలంలో అదానీ ఆయన ప్రతినిధులు పర్యటించి పలు చర్చలు జరిపి కొత్తగా ఒప్పందాలు చేసుకున్నారు. గతంలో అదానీ అక్రమంగా రుణాలు సేకరించిందనీ, షేర్ల మాయాజాలం చేసిందనీ ఆరోపణలు వచ్చినపుడు కూడా ఇలాంటి వాదనలతోనూ సాంకేతిక సమర్థనలతోనూ సరిపెట్టారు. ఇప్పుడు ఈ వాదనలన్నీ కూడా అటే నడుస్తున్నట్టు కనిపిస్తుంది. దాని వల్ల కూడా దేశానికి నష్టమే, ఎందుకంటే తప్పు చేసిన వాళ్ల పేర్లు బయటపెట్టకుండా కప్పిపుచ్చడమంటే బ్లాక్‌మెయిల్ చేయడానికి అవకాశం, తద్వారా మన ప్రయోజనాలు బలిపెట్టి తమ స్వార్థం సాగించుకోవడం జరగొచ్చు. కనుకనే దీన్ని ఇంతటితో వదలిపెట్టడం ప్రమాదకరం. సమగ్రమైన దర్యాప్తు జరిపి దోషులను శిక్షించడంతో పాటు వ్యవస్థలో లొసుగులు చక్కదిద్దడం అవసరం. శ్రీలంక, కెనడా, అస్ట్రేలియా, బంగ్లాదేశ్ వంటి దేశాల ప్రభుత్వాలు అదానీ ఒప్పందాలు రద్దు చేయడం, తనిఖీ చేయడం చూస్తున్నాం గానీ స్వదేశంలో మాత్రం ఆయన అక్రమాలు నల్లేరుమీద బండిలా నడిచిపోతున్నాయి. అయితే మోడీ సర్కారు కూడా ఎల్లకాలం అవినీతి కొండ చిలువలను కాపాడలేదనేది స్పష్టం. దీన్ని అర్థం చేసుకోవడానికి, అశేష ప్రజానీకానికి అర్థం చేయించడానికి ఇంకా ఎన్ని రహస్యాలు బహిరంగం కావాలి?.

మారుపాక అనిల్ కుమార్
94404 82429

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News