గోదావరిఖని: తెలంగాణ ప్రభుత్వం వారు రామగుండంలో ఏర్పాటు చేసిన కొత్త మెడికల్ కాలేజీ (సింగరేణి ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో సింగరేణికి ప్రత్యేకించిన 5శాతం రిజర్వేషన్ కోటా కింద 7 సీట్లు పొందడంకోసైం సింగరేణి ఉద్యోగులు, అధికారుల పిల్లలు ఈ నెల 14వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని సంస్థ డైరెక్టర్ ఫైనాన్స్, పర్సనల్ ఎన్.బలరాం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రామగుండంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీ సింగరేణి ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరుతో పెట్టడంతోపాటు ఆ కళాశాలలో 5శాతం సీట్లను సింగరేణి పిల్లలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 75ను ఈ నెల 4వ తేదీన విడుదల చేసిందని, ఈ సదావకాశాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే పొందవచ్చని రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి ప్రకటించినట్లు తెలిపారు. ఐదు శాతం రిజర్వేషన్ కింద సింగరేణి కార్మికుల పిల్లలకు ఏడు సీట్లు లభిస్తాయని, ఈ సీట్లను జాతీయ స్థాయి నీట్ పరీక్షలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఎంపిక చేస్తారని పేర్కొన్నారు.
దరఖాస్తు చేసిన వారిలో అత్యుత్తమ ర్యాంకుతోపాటు ఎస్‌సి, ఎస్‌టి, బిసి, రిజర్వేషన్ వర్తింపజేస్తూ కాళోజీ నారాయణ రావు యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారు సీట్లు కేటాయిస్తారని తెలిపారు. ఈ సీట్ల కోసం దరఖాస్తు చేయదలుచుకున్న సింగరేణి ఉద్యోగుల పిల్లలు, వారి తల్లి లేదా తండ్రి పని చేస్తున్న గని లేదా విభాగం అధిపతుల నుంచి నిర్దేశిత నమూనాలో ధ్రువీకరణ పత్రాన్ని తీసుకొని సమర్పించాలని, సోమవారం దీనిపై సింగరేణి హెచ్‌ఆర్‌డి శాఖ వారు ఒక సర్కూలర్ విడుదల చేశారని తెలిపారు. వైద్య విద్య చేపట్టాలనుకునే సింగరేణి పిల్లలకు ఇది ఒక గొప్ప అవకాశమని ఆయన తెలిపారు.