మనతెలంగాణ/హైదరాబాద్ : మలేషియా తెలంగాణ అసోసియేషన్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నిర్వహించనున్న దశాబ్ది ఉత్సవాలకు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ను హాజరుకావాలని అసోసియేషన్ ఆహ్వానించింది. నవంబర్ 9వ తేదీన మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగే ఈ దశాబ్ది ఉత్సవాలకి మలేషియాలోని తెలంగాణ వాసులు పెద్ద ఎత్తున హాజరవుతారని తెలిపింది. మలేషియా తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షులు తిరుపతి, మాజీ ఎంఎల్‌ఎ గాదరి కిషోర్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం ఆదివారం నందినగర్‌లోని నివాసంలో కెటిఆర్‌కి ఆహ్వానం అందజేశారు.
కేవలం మలేషియాలోని తెలంగాణ వాసులే కాకుండా అనేక దేశాల నుంచి ఈ ఉత్సవాలకు ప్రత్యేకంగా తెలంగాణ ప్రముఖులు హాజరు కానున్నారని కెటిఆర్ తెలిపారు. తెలంగాణ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా, ఏ దేశం వెళ్లినా తెలంగాణ ప్రాంతీయులు తెలంగాణ రాష్ట్రం పట్ల తెలంగాణ ప్రజల పట్ల ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు.
మలేషియాలోనూ తెలంగాణ వాసులు తమకంటూ ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసుకొని అనేక రకాల కార్యక్రమాల్లో తెలంగాణ గడ్డతో మమేకం కావడం పట్ల అభినందించారు. ఈ ప్రస్థానంలో 10 సంవత్సరాల మైలురాయిని విజయవంతంగా పూర్తి చేసుకున్న మలేషియా తెలంగాణ అసోసియేషన్‌కి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నేతలు కార్తీక్ రెడ్డి, రాకేష్ రెడ్డి పాల్గొన్నారు.