మన తెలంగాణ/హైదరాబాద్: ఈ ఏడాది జూన్‌లో న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) తరపున న్యూయార్క్‌లో నిర్వహించే బోనాల ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరు కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్కను నైటా కార్యవర్గం ఆహ్వానించింది. నైటా కొత్త అధ్యక్షురాలిగా ఎంపికైన వాణి ఏనుగు గురువారం మంత్రిని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రిని న్యూయార్క్‌లో నిర్వహించే బోనాల ఉత్సవాలకు హాజరు కావాలని ఆహ్వానించగా ఇందుకు మంత్రి సీతక్క సుముఖత వ్యక్తం చేశారు. అమెరికా ప్రధాన నగరమైన న్యూయార్క్‌లో తెలుగు వారికి ఓ సంఘం ఏర్పాటు చేయటంతో పాటు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించేందుకు నైటా చేస్తున్న కృషిని మంత్రి అభినందించారు. నైటా కొత్త కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. మహిళా శక్తికి ఆదర్శంగా నిలిచి, నైటా సేవలను మరింత విస్తృత పరచాలని ఈ సందర్భంగా సూచించారు. వాణితో పాటు కుటుంబ సభ్యులను మంత్రి సన్మానించారు.