వృద్ధులు, దివ్యాంగులు, అత్యవసర సర్వీసుల వారికి అవకాశం
మనతెలంగాణ/ హైదరాబాద్ : పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకునే వారు నవంబరు 7వ తేదీలోగా ఫారం- 12 (డి) దరఖాస్తులను సంబంధిత నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు అందజేయాలని ఎన్నికల సంఘం కోరింది. 80 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు, 40 శాతానికి పైగా వైకల్యం కలిగిన దివ్యాంగులకు, కొవిడ్ పాజిటివ్ ఉన్న వారికి ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు ఉందని పేర్కొంది. అత్యవసర సర్వీసులకు చెందిన వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఫారం- 12 (డి) దరఖాస్తులను నోడల్ అధికారి నుంచి, రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల నుంచి పొందవచ్చని, ఎన్నికల సంఘం పోర్టల్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
దరఖాస్తు చేసుకున్న వారు సంబంధిత రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ప్రత్యేక పోస్టల్ ఓటింగ్ సెంటర్ (పివిసి) అందుబాటులో ఉంటుందన్నారు. ఒకసారి పోస్టల్ బ్యాలెట్ కోసం పేర్కొన్న ఫారం ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశమివ్వరని, ఓటరు జాబితాలో వారి పేరును పోస్టల్ బ్యాలెటు కింద మార్కింగ్ చేస్తారని తెలిపారు.