Thursday, January 23, 2025

పిపిపి విధానంలో విద్యుత్ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఆహ్వానం

- Advertisement -
- Advertisement -
రెడ్కో ఛైర్మన్ సతీష్ రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేదిశగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో.. తెలంగాణ పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ విశేష కృషి చేస్తోందని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ లో 405 ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ మారుమూల ప్రాంతాల్లోనూ ఎలక్ట్రిక్ వాహనాలకు మౌలిక వసతులు కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాలు వాడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని,ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసిన ప్రతీ ఒక్కరికి చార్జింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా రాష్ట్రమంతటా చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.

రాష్ట్రంలో 2025 కల్లా 3000 ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. దీనికోసం రెడ్కో సంస్థ స్వయంగా చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని.. దాంతో పాటు ప్రైవేటు సంస్థలను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మినహా.. రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల కేంద్రాలు, హైవేలపై మొత్తం 615 ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహన కేంద్రాల ఏర్పాటుకు ప్రవేటు వ్యక్తులను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో పబ్లిక్ ప్రైవేటు పార్ట్ నర్ షిప్ తో చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని.. ఇప్పటికే యాదాద్రిలో పీపీపీ విధానంలో దేశంలోనే మొదటి చార్జింగ్ కేంద్రం ఏర్పాటు చేశామని, ఇది చాలా విజయవంతంగా నడుస్తోందన్నారు. ఇప్పుడు రాష్ట్రంలోని జిల్లాలలో, హైవేలపై మొత్తం 615 ప్రాంతాల్లో టిఎస్ రెడ్కొ చూపించిన స్థలాల్లో ప్రైవేటు సంస్థలు ఫాస్ట్ మరియు స్లో చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు, విధివిధానాల కోసం హైదరాబాద్ లోని తెలంగాణ పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ (టిఎస్ రెడ్కో) కేంద్ర కార్యాలయంలో గానీ, జిల్లాలోని సంస్థ కార్యాలయాల్లో కానీ లేదా వెబ్ సైట్ ను కానీ సందర్శించాలని సూచించారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెడ్కో సంస్థ స్వయంగా 150 వరకు చార్జింగ్ కేంద్రాలు ఫాస్ట్ చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిందని.. ఇందులో 90 కేంద్రాలు వినియోగంలోకి వచ్చాయని, గ్రేటర్‌లో మరిన్ని చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని రెడ్కో ఛైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 615 కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యాక మరిన్ని కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు. ప్రజలు రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలంతా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. మంత్రి కేటీఆర్ చొరవతో రాష్ట్ర ప్రభుత్వం కూడా 1200 ఎకరాల్లో ఈ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తోందన్నారు. ఓ వైపు ఎలక్ట్రిక్ వాహన తయారీ రంగానికి, మరోవైపు వాటి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని చెప్పారు. ఈవీ కొనుగోలు చేసేవారికి రిజిస్ట్రేషన్ చార్జీలు, ట్యాక్స్ మినహాయింపు ఇస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో ఇప్పటికే రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య భారీగా పెరిగిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News