న్యూఢిల్లీ : సెప్టెంబర్ ముగింపు నాటి రెండో త్రైమాసిక ఫలితాల్లో ప్రభుత్వరంగ బ్యాంక్ ఐఒసి (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్) అద్భుతంగా రాణించింది. జులైసెప్టెంబర్(క్యూ2)లో కంపెనీ నికర లాభం రూ.12,967 కోట్లు నమోదు చేసింది. ఐఒసి ఇప్పటి వరకు ప్రకటించిన అత్యుత్తమ వార్షిక ఫలితాల్లో సగం కంటే ఎక్కువ లాభాన్ని ఒకే త్రైమాసికంలో ఆర్జించి రికార్డు సృష్టించింది. 2022 జులైసెప్టెంబర్ త్రైమాసికంలో ఐఒసి రూ.272.35 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. అయితే ఇప్పుడు కంపెనీ ఊహించని రీతిలో భారీ లాభాలను ఆర్జించింది.
గత ఏడాది చమురు ధరలు అత్యధికంగా ఉండగా, తర్వాత ఈ ధరలు తగ్గడం కంపెనీ నష్టాలను భర్తీ చేయడంతో దోహదం చేసింది. పెట్రోలియం ఉత్పత్తుల విక్రయం నుంచి ప్రిటాక్స్ లాభాలు రూ.17,755 కోట్లుగా ఉండగా, గతేడాదిలో ఇది రూ.104 కోట్లుగా ఉన్నాయి. గతేడాది రష్యాఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ చమురు ధరలు భారీగా పెరిగాయి. అయినప్పటికీ ప్రభుత్వరంగ చమురు సంస్థలు ఐఒసి, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బిపిసిఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పిసిఎల్)లు పెట్రో ధరలను స్థిరంగా కొనసాగిస్తూ వచ్చాయి.
ఈ కారణంగా ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు 202223 మొదటి ఆరు నెలల్లో నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. 2022 ఏప్రిల్‌సెప్టెంబర్ కాలంలో ఇండియన్ ఆయిల్ కూడా రూ.2,264 కోట్ల నష్టాలను నమోదు చేసింది. ఈ సంవత్సరం (202324) ఏప్రిల్ సెప్టెంబర్ కాలంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దాదాపు రూ.26,717 కోట్ల లాభాలను నమోదు చేసింది. ఇది 202122 సంవత్సరంలో ఆర్జించిన మొత్తం లాభం రూ.24,184 కోట్ల కంటే ఎక్కువగా ఉంది. క్యూ2లో కంపెనీ ఆదాయం రూ.2.28 లక్షల కోట్ల నుంచి రూ.2.02 లక్షల కోట్లకు తగ్గింది.
56 శాతం పెరిగిన గెయిల్ లాభం
ప్రభుత్వరంగ గ్యాస్ యుటిలిటీ సంస్థ గెయిల్ ఇండియా సెప్టెంబర్ ముగింపు నాటి రెండో త్రైమాసిక ఫలితాల్లో అద్భుతంగా రాణించింది. క్యూ2లో కంపెనీ నికర లాభం రూ.2,404.89 కోట్లు నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.1,412 కోట్లుగా ఉంది. కంపెనీ ఆదాయం రూ.32,227 కోట్ల నుంచి రూ.31,822 కోట్లకు అంటే 1.25 శాతం తగ్గింది.