Monday, November 18, 2024

ఇక బిరబిరా ఆయిల్

- Advertisement -
- Advertisement -

IOCL Deal with Russia Oil Company

న్యూఢిల్లీ: రష్యా నుంచి చౌక ధరలకు ముడిచమురు ఒప్పందాన్ని భారతదేశం సమీకరించుకునేందుకు రంగం సిద్ధం అయింది. రష్యా నుంచి 30 లక్షల బ్యారెల్స్ క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకునే కాంట్రాక్టుపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసిఎల్) రష్యా ఆయిల్ కంపెనీతో ఒప్పందంపై సంతకాలు చేసింది. దీనితో ఇక త్వరితగతిన రష్యా ముడిచమురు ఇండియాకు వచ్చేందుకు మార్గం సుగమం అయింది. ఇది ప్రభుత్వాల మధ్య కుదిరిన డీల్ కాదని, రెండు దేశాల చమురు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రష్యా ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈ చమురు కొనుగోళ్ల విషయంలో దౌత్యపరమైన చిక్కులు తలెత్తకుండా, ప్రత్యేకించి అమెరికాతో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకునేందుకు భారత ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంది. రష్యా నుంచి చమురు దిగుమతులపై అమెరికా ఇతర దేశాల ఆంక్షలు, ఇతరత్రా కట్టుదిట్టమైన నిబంధనల నేపథ్యంలోనే రష్యా నుంచి క్రూడాయిల్‌ను భారతదేశం సమీకరించుకోవడం ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రధాన అంశం అయింది. రష్యా నుంచి చమురు తీసుకునే విషయంలో భారతదేశాన్ని తాము శాసించడం లేదని, భారత చమురు సంస్థలు ఈ డీల్ కుదుర్చుకుంటే తాము ఏమీ చేయలేమని ఇటీవలే అమెరికా తేల్చిచెప్పింది. అయితే ఇతరత్రా పరిణామాలు ఉంటాయని భారత్‌కు అమెరికా పరోక్షహెచ్చరికలు వెలువరించింది. ఇప్పుడు రష్యా చమురు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దేశ అతి పెద్ద ఇంధన సంస్థగా ఉంది. ఇప్పటికే ఆయిల్ కార్పొరేషన్ రష్యా నుంచి అత్యంత చౌక ధరలకు 30 లక్షల బ్యారెల్స్ ఆయిల్‌ను తెప్పించుకుంది. ఇప్పుడు మరో ఆఫర్ అందడంతో ఈ దిశలో ముందుకు సాగింది. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపధ్యంలో చమురు సంక్షోభం తలెత్తకుండా ఉండేందుకు భారతదేశం అన్ని చర్యలూ చేపట్టింది. దేశీయంగా విపరీత స్థాయిలో ఉంటూ వచ్చిన ఇంధన అవసరాలపై ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ నివారణ చర్యలకు దిగింది.
అమెరికా నుంచీ పెరగనున్న దిగుమతులు
మరో వైపు అమెరికానుంచి కూడా చమురు దిగుమతులను పెంచుకునే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఈ ఏడాది అగ్రరాజ్యంనుంచి చమురు దిగుమతులు 11శాతం పెరిగే అవకాశముందని ఆ అధికారి చెప్పారు. ఉక్రెయిన్‌పై దండయాత్ర నేపథ్యంలో రష్యానుంచి ఇంధన కొనుగోళ్లపై ఇటీవల అమెరికా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. వీటిని భారత్ శుకరవారం గట్టిగా తిప్పికొట్టింది. ఇంధన వనరుల్లో స్వయం సమృద్ధి సాధించిన దేశాలు, రష్యానుంచి దిగుమతి చేసుకుంటున్న దేశాలు భారత చట్టబద్ధ దిగుమతులను రాజకీయం చేయడం సరికాదని హితవు పలికింది. ఈ తరుణంలో అమెరికానుంచి భారత్ చమురు దిగుమతులను పెంచుకొంటుండడం గమనార్హం. ముడి చమురు కోసం మధ్యప్రాచ్య దేశాలపై ఆధారపడడం తగ్గించుకోవాలని భారత్ యోచిస్తోంది. ఈ ఉద్దేశంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తోంది. భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఇరాక్ కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా ఉన్నాయి. నైజీరియాను వెనక్కి నెట్టి కువైట్ నాలుగో స్థానానికి చేరింది. దేశ ముడి చమురు అవసరాల్లో రష్యా దిగుమతులు ఒక శాతంకన్నా తక్కువే ఉన్నాయి.

IOCL Deal with Russia Oil Company

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News