ఐపిఇఎఫ్‌పై చైనా అక్కసు
బీజింగ్: భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ ఇండో పసిఫిక్ భాగస్వామ్యంపై చైనా మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది. 12 ఇండో పసిఫిక్ భాగస్వామ్యంతో తెరపైకి వచ్చిన ఐపిఇఎఫ్ విఫలయత్నంగా మిగిలిపోతుందని జోస్యం చెప్పింది. టోక్యోలో ఐపిఇఎఫ్ ఏర్పాటుపై ప్రకటన వెలువడిన సమయంలోనే ఆసియా, పసిఫిక్ ప్రాంత ఆర్థిక, సామాజిక కమిషన్ సమావేశాన్ని ఉద్దేశించి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి వీడియో ద్వారా ప్రసంగిస్తూ ఐపిఇఎఫ్‌ను మరో నాటో ఆర్థిక కూటమిగా అభివర్ణించారు. వీటి ముసుగులో ఇండోపసిఫిక్ ప్రాంతంలో సైనిక స్థావరాల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణను ఆయన పునరుద్ఘాటిస్తూ ఈ ప్రయత్నాలను అడ్డుకోవాలని ఆసియా, పసిఫిక్ దేశాలకు పిలుపునిచ్చారు. ఈ ప్రాంత శాంతి సుస్థిరతలను పరిరక్షించడానికి ఈ ప్రాంత దేశాలు దృఢచిత్తంతో వ్యవహరించాలని, ఈ ప్రాంతంలో సైనిక స్థావరాలను ఏర్పాటు చేయడానికి జరిగే ఏ ప్రయత్నాన్నయినా తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. చైనా కూడా ఉండే ఆసియాపసిఫిక్ ప్రాంత సహకార భాగస్వామ్యంకోసం బీజింగ్ ఓ సమగ్రమైన, పురోగామి ఒప్పందాన్ని రూపొందిస్తుందని కూడా వాంగ్‌యీ హామీ ఇచ్చారు.