ముంబై: ఐపిఎల్ 14వ సీజన్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ బౌలింగ్ ఎంచుకున్నాడు. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లు ఇరు జట్లకు అందుబాటులో ఉన్నారు. ఈ సీజన్‌లో రాజస్థాన్‌కు సంజు శాంసన్ సారథ్యం వహిస్తున్నాడు. కిందటి సీజన్‌లో స్మిత్ కెప్టెన్సీలో రాజస్థాన్ పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచింది.
పంజాబ్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేక పోయింది. కానీ ఈసారి మాత్రం రెండు జట్లు కూడా మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో గెలిచి సీజన్‌కు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నాయి. క్రిస్ గేల్, రాహుల్, నికోలస్ పూరన్, ఫాబియన్ అలాన్, మయాంక్ అగర్వాల్, మణ్‌దీప్ సింగ్, సర్ఫరాజ్ ఖాన్ తదితరులతో పంజాబ్ చాలా బలంగా ఉంది. గేల్, రాహుల్, పూరన్, మయాంక్ వంటి విధ్వంసక బ్యాట్స్‌మెన్‌లు ఉండడం ఆ జట్టుకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. కిందటి సీజన్‌లో గేల్, మయాంక్, రాహుల్‌లు అద్భుతంగా రాణించారు. ఈసారి కూడా జట్టును ఆదుకునేందుకు సిద్ధమయ్యారు.