క్రికెటర్లపై కనక వర్షం.. మోరిస్ @రూ.16.25 కోట్లు
మాక్స్‌వెల్ హవా, జెమీసన్ జోరు, కృష్ణప్ప సంచలనం, చెన్నైకి పుజారా, షారుఖ్, మెరెడిత్ జాక్‌పాట్
ఆటగాళ్లపై కోట్లు కురిపించిన ఐపిఎల్ వేలం పాట
చెన్నై: ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) వేలం పాట క్రికెటర్లపై కనక వర్షం కురిపించింది. గతంతో పోల్చితే ఈసారి ఇటు భారత్, అటు విదేశీ క్రికెటర్లు భారీ ధరకు అమ్ముడు పోయారు. కిందటి ఐపిఎల్‌లో పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచిన క్రిస్ మోరిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మోయిన్ అలీ తదితరులు కళ్లు చెదిరే ధరలకు అమ్ముడు పోరారు. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ ఐపిఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడు పోయిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. మరోవైపు న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ కిల్ జెమీసన్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయాడు. అతన్ని బెంగళూరు సొంతం చేసుకుంది. మరోవైపు భారత క్రికెటర్లు కృష్ణప్ప గౌతం, షారూక్ ఖాన్, శివమ్ దూబే తదితరులపై కూడా కనక వర్షం కురిసింది. ఆయా ఫ్రాంచైజీలు వీరిని కోట్లాది రూపాయలకు సొంతం చేసుకున్నాయి. మరోవైపు మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారాకు కూడా ఐపిఎల్ వేలం పాటలో అదృష్టం వరించింది. అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఇక ఈసారి ఐపిఎల్‌లో కళ్లు చెదిరే ధరకు అమ్ముడు పోతాడని భావించిన డేవిడ్ మలన్ (ఇంగ్లండ్)కు ఆశించిన ధర లభించలేదు. అతను కనీస ధర రూ. కోటిన్నరకే అమ్ముడు పోయాడు.
మోరిస్‌కు రికార్డు ధర
ఐపిఎల్‌లోకిందటి సీజన్‌లో బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన మోరిస్‌ను ఈసారి రాజస్థాన్ రాయల్స్ కళ్లు చెదిరే ధరను చెల్లించి సొంతం చేసుకుంది. రూ.75 లక్షల కనీస ధరతో వేలం పాటలో బరిలోకి దిగిన మోరిస్‌ను రాజస్థాన్ జట్టు ఏకంగా రూ.16.25 కోట్లను చెల్లించి దక్కించుకుంది. మోరిస్ కోసం ముంబై ఇండియన్స్, పంజాబ్, రాజస్థాన్ జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి రాజస్థాన్ మోరిస్‌ను చేజిక్కించుకుంది.
జెమీసన్‌కు జాక్‌పాట్
మరోవైపు న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ జెమీసన్ ఈసారి వేలం పాటలో జాక్‌పాట్ కొట్టేశాడు. బెంగళూరు ఫ్రాంచైజీ అతన్ని రూ.15 కోట్లకు సొంతం చేసుకుంది. కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో జెమీసన్ నిలకడైన ప్రదర్శనతో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. దీంతో అతన్ని సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి భారీ మొత్తం ధరతో బెంగళూరు జెమీసన్‌ను దక్కించుకుంది.
డిమాండ్ తగ్గని మాక్స్‌వెల్
కిందటి సీజన్‌లో పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహించిన గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) వేలం పాటలో మరోసారి జాక్‌పాట్ కొట్టాడు. యూఎఇ వేదికగా జరిగిన ఐపిఎల్‌లో ఒక్క సిక్సర్‌ను కూడా కొట్టని మాక్స్‌వెల్‌ను పంజాబ్ వదిలేసుకుంది. అయితే ఈసారి వేలం పాటలో మాక్స్‌వెల్‌ను బెంగళూరు రూ.14.25 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది.
రిచర్డ్‌సన్ సంచలనం
ఆస్ట్రేలియాకు చెందిన యువ ఫాస్ట్ బౌలర్ జై రిచర్డ్‌సన్ ఈసారి ఐపిఎల్ వేలం పాటలో సంచలనం సృష్టించాడు. బిగ్‌బాష్ టోర్నీలో అద్భుతంగా రాణించిన రిచర్డ్‌సన్‌ను దక్కించుకునేందుకు పలు ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి పంజాబ్ జట్టు అతన్ని సొంతం చేసుకుంది. పంజాబ్ రికార్డు స్థాయిలో రూ.14 కోట్లు వెచ్చించి రిచర్డ్‌సన్‌ను చేజిక్కించుకుంది.
కృష్టప్ప గౌతంపై కనక వర్షం
ఇక కర్నాటక స్పిన్ ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతం కూడా ఈసారి ఐపిఎల్‌లో జాక్‌పాట్ కొట్టేశాడు. కిందటి ఏడాది గౌతం నిరాశ పరిచాడు. అయినా కూడా ఈసారి వేలం పాటలో అతనికి అదృష్టం వరించింది. చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని రికార్డు ధర రూ.9.25 కోట్లకు సొంతం చేసుకుంది. ఈసారి గౌతం రూ.20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు. కానీ అతను అనూహ్యంగా కళ్లు చెదిరే ధరకు అమ్ముడు పోవడం విశేషం. ఈ వేలం పాటలో అతనే హైలైట్‌గా నిలిచాడు.
మెరిసిన మెరెడిత్
ఆస్ట్రేలియా యువ స్పీడ్‌స్టర్ మెరెడిత్ కూడా ఈసారి ఐపిఎల్ వేలం పాటలో పెను సంచలనం స్టష్టించాడు. బిగ్‌బాష్‌లో అసాధారణంగా రాణించిన మెరెడిత్‌ను దక్కించుకునేందుకు పలు ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి పంజాబ్ రూ. 8 కోట్లు చెల్లించి అతన్ని సొంతం చేసుకుంది.
షారుఖ్ ఖాన్ హవా
తమిళనాడు యువ బ్యాట్స్‌మన్ షారుఖ్ ఖాన్ అనుకున్నట్టే ఈసారి వేలం పాటలో జాక్‌పాట్ కొట్టాడు. ఇటీవల ముగిసిన ముస్తాక్ అలీ ట్రోఫీలో విధ్వంసక బ్యాటింగ్‌ను కనబరిచిన షారుఖ్‌కు వేలం పాటలో అనూహ్య డిమాండ్ ఏర్పడింది. రూ.20 లక్షల కనీస ధరతో వేలంలోకి దిగిన షారుఖ్‌ను పంజాబ్ ఏకంగా రూ.5.25 కోట్లకు దక్కించుకుంది.
మోయిన్ అలీకి రూ.7 కోట్లు
ఇంగ్లండ్ సీనియర్ ఆల్‌రౌండర్ మోయిన్ అలీ కూడా ఐపిఎల్‌లో కళ్లు చెదిరే ధరకు అమ్ముడు పోయాడు. కిందటి సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించని మోయిన్‌ను బెంగళూరు వదిలేసుకుంది. ఈసారి అతను అమ్ముడు పోవడమే కష్టమని అందరూ భావించారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ అతనిపై నమ్మకం పెట్టుకుంది. ఏకంగా ఏడు కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. మరోవైపు బంగ్లాదేశ్ ఆల్‌రౌండ్ షకిబ్ అల్ హసన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతం చేసుకుంది. కోల్‌కతా రూ.3.2 కోట్లకు షకిబ్‌ను కొనుగోలు చేసింది. కౌల్టర్ నైల్ (ఆస్ట్రేలియా), పియూష్ చావ్లాలను కోట్లాది రూపాయలు చెల్లించి ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఇక ఆల్‌రౌండర్ శివమ్ దూబేను రాజస్థాన్ రాయల్స్ రూ.4.4 కోట్లకు దక్కించుకుంది. ఇక టెస్టు క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్న చటేశ్వర్ పుజారాను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. అతని కనీస ధర రూ. 50 లక్షలకు చెన్నై సొంతం చేసుకుంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్ దక్కించుకుంది.
IPL 2021 Auction: Chris Morris becomes most expensive