ముంబై: ఈ సీజన్లో తొలి విజయం సాధించడమే లక్షంగా శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగే పోరుకు చెన్నై సూపర్ కింగ్స్ సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో పరాజయం పాలైన చెన్నైకి ఈ పోరు కీలకంగా మారింది. ఇందులో గెలిచి టైటిల్ వేటకు శ్రీకారం చుట్టాలనే పట్టుదలతో సిఎస్కె ఉంది. కిందటి మ్యాచ్‌లో సురేశ్ రైనా, మొయిన్ అలీ, రాయుడు తదితరులు నిలకడగా ఆడడం చెన్నైకి ఊరటనిచ్చే అంశం. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోరును సాధించినా పృథ్వీషా, శిఖర్ ధావన్‌ల మెరుపు బ్యాటింగ్ వల్ల చెన్నైకి ఓటమి తప్పలేదు.
ఈ మ్యాచ్‌లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూసుకోవాలని చెన్నై భావిస్తోంది. ఈసారి కూడా రైనా, రాయుడులపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇక తొలి మ్యాచ్‌లో విఫలమైన ఓపెనర్లు రుతురాజ్, డుప్లెసిస్ ఈసారి మెరుగైన ఆరంభాన్ని ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ధోనీ కూడా బ్యాట్ ఝులిపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. బ్రావో, మొయిన్, జడేజా తదితరులు తమ వంతు పాత్ర పోషిస్తే ఈ మ్యాచ్‌లో చెన్నైకి విజయం పెద్ద కష్టమేమీ కాదు. ఇక రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన పంజాబ్ ఈ పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. కెప్టెన్ లోకేశ్ రాహుల్, గేల్, దీపక్ హుడా, మయాంక్ తదితరులతో పంజాబ్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. బౌలింగ్ కూడా బాగానే కనిపిస్తోంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.
IPL 2021: CSK vs KXIP Match Tomorrow