బోణీ కొట్టేదెవరో?
సమరోత్సాహంతో ముంబై, ఆత్మవిశ్వాసంతో బెంగళూరు
నేడు ఐపిఎల్ సీజన్14 తొలి పోరు
చెన్నై: అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. అత్యంత జనాదారణ కలిగిన క్రికెట్ టోర్నమెంట్‌గా పేరు తెచ్చుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 14వ సీజన్‌కు శుక్రవారం తెరలేవనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో విరాట్ కోహ్లి సేన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. మరోవైపు రెండు జట్లు కూడా ఆరంభ మ్యాచ్‌లో గెలిచి టైటిల్ వేటకు శ్రీకారం చుట్టాలనే పట్టుదలతో ఉన్నాయి. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఇక కరోనా విజృంభణ నేపథ్యంలో ఖాళీ స్టేడియంలోనే మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఐదు ఐపిఎల్ ట్రోఫీలతో లీగ్‌లో ఎదురులేని శక్తిగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ ఈసారి కూడా ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఇక బెంగళూరు కూడా తన ట్రోఫీ లోటును తీర్చుకోవాలనే లక్షతో పోరుకు సిద్ధమైంది. పడిక్కల్, కోహ్లి, డివిలియర్స్, మాక్స్‌వెల్, అజారుద్దీన్, జెమీసన్, క్రిస్టియన్ తదితరులతో బెంగళూరు బలంగానే కనిపిస్తోంది. మరోవైపు రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబైలో అగ్రశ్రేణి ఆటగాళ్లకు కొదవలేదు. రోహిత్‌తోపాటు డికాక్, సూర్యకుమార్, ఇషాన్ కిషన్, హార్దిక్, పొలార్డ్, కృనాల్, సౌరభ్ తివారి, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ఈసారి కూడా తన జైత్రయాత్రను కొనసాగిస్తూ ఆరో ట్రోఫీని సాధించాలని ముంబై తహతహలాడుతోంది. ఇక మే 30న జరిగే ఫైనల్‌తో ఐపిఎల్‌కు తెరపడనుంది.
శుభారంభంపై దృష్టి..
వరుస ట్రోఫీలను సాధిస్తున్న ముంబై ఇండియన్స్‌కు ప్రతిసారి ఆరంభ మ్యాచ్‌లో ఓటమి ఎదురు కావడం అనవాయితీగా మారింది. కిందటి సీజన్‌లో కూడా ముంబై తొలి మ్యాచ్‌లో పరాజయం తప్పలేదు. ఈసారి మాత్రం ఆ సంప్రదాయానికి తెరదించాలని రోహిత్ సేన భావిస్తోంది. బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేయాలనే పట్టుదలతో ఉంది. ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ సిరీస్‌లో రోహిత్ శర్మ, సూర్యకుమార్, ఇషాన్ కిషన్, కృనాల్, హార్దిక్ తదితరులు అద్భుతంగా రాణించారు. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఎప్పటిలాగే రోహిత్ ఈసారి కూడా జట్టుకు కీలంగా మారాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే రోహిత్ విజృంభిస్తే జట్టుకు భారీ నల్లేరుపై నడకే. ఇక ఈ మ్యాచ్‌లో డికాక్ ఆడతాడా లేదా అనేది ఇంకా తేలలేదు. మరోవైపు సూర్యకుమార్, ఇషాన్ కిషన్‌ల రూపంలో మెరుపులు మెరిపించే బ్యాట్స్‌మెన్‌లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. కిందటి సీజన్‌లో కూడా ఇద్దరు అసాధారణ బ్యాటింగ్‌తో అలరించారు. ఈసారి కూడా చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు కృనాల్, హార్దిక్‌లు కూడా ఇంగ్లండ్‌పై మెరుపులు మెరిపించారు. హార్దిక్ ఇప్పటికే జట్టు ప్రధాన అస్త్రాల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఇటు బంతితో అటు బ్యాట్‌తో చెలరేగే సత్తా హార్దిక్ సొంతం. మరోవైపు కృనాల్ కూడా ఆల్‌రౌండ్‌షోతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఇక కీరన్ పొలార్డ్ రూపంలో ప్రపంచ స్థాయి ఆల్‌రౌండర్ ముంబైకు ఉండనే ఉన్నాడు. ప్రతి సీజన్‌లోనూ నిలకడైన ఆటతో అలరించడం పొలార్డ్ అలవాటుగా మార్చుకున్నాడు. ఈ సీజన్‌లో కూడా జట్టుకు అండగా నిలిచేందుకు సిద్ధమయ్యాడు. ఇక బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ రూపంలో అగ్రశ్రేణి స్పీడ్‌స్టర్లు కూడా జట్టులో ఉన్నారు. కిందటి సీజన్‌లో బౌల్ట్ అద్భుతంగా రాణించాడు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించేందుకు సిద్దంగా ఉన్నాడు. మరోవైపు బుమ్రాకు ఐపిఎల్‌లో అద్భుత రికార్డు ఉండనే ఉంది. ముంబై విజయాల్లో అతని పాత్ర చాలా కీలకం. ఇలా రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న ముంబై ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
అందరి కళ్లు కోహ్లిపైనే..
మరోవైపు బెంగళూరు కూడా తొలి మ్యాచ్‌లో విజయమే లక్షంగా పెట్టుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. ఇంగ్లండ్‌పై అద్భుతంగా రాణించిన కెప్టెన్ కోహ్లి ఈసారి జట్టుకు కీలకంగా మారాడు. కోహ్లి విజృంభిస్తే బెంగళూరు బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి. ఇక యువ ఓపెనర్ దేవ్‌దుత్ పడిక్కల్ కూడా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడు. కోహ్లితో కలిసి అతను ఇన్నింగ్స్ ప్రారంభించడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు డివిలియర్స్, మాక్స్‌వెల్ వంటి విధ్వంసక బ్యాట్స్‌మెన్ కూడా జట్టులో ఉన్నారు. డివిలియర్స్‌కు ఐపిఎల్‌లో కళ్లు చెదిరే రికార్డు ఉన్న విషయం తెలిసిందే. ఇక మాక్స్‌వెల్ తొలిసారి బెంగళూరు తరఫున బరిలోకి దిగుతున్నారు. భారీ మొత్తం ధరకు బెంగళూరు అతన్ని కొనుగోలు చేసింది. ఈసారి మాక్స్‌వెల్ బెంగళూరుకు చాలా కీలకంగా మారాడు. ఇక తమిళనాడుకు చెందిన యువ సంచలనం మహ్మద్ అజారుద్దీన్ కూడా జట్టుకు ప్రధాన అస్త్రంగా కనిపిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగిన అజారుద్దీన్‌ను కూడా భారీ మొత్తం చెల్లించి చాలెంజర్స్ సొంతం చేసుకుంది. క్రిస్టియన్ రూపంలో అగ్రశ్రేణి ఆల్‌రౌండర్ కూడా జట్టులో ఉన్నాడు. చాహల్, సైని, సిరాజ్ తదితరులతో బెంగళూరు బౌలింగ్ కూడా బలంగానే కనిపిస్తోంది. దీంతో ముంబైను ఓడించి శుభారంభం చేసే సత్తా బెంగళూరుకు ఉందనే చెప్పాలి.
IPL 2021: MI vs RCB Match Tomorrow