హైదరాబాద్‌కు హ్యాట్రిక్ ఓటమి, ముంబై ఉత్కంఠ గెలుపు
చెన్నై: ఐపిఎల్ సీజన్14లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస పరాజయాల పరంపర కొనసాగుతోంది. శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 13 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సన్‌రైజర్స్‌కు ఇది వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం. ఇక ముంబైకి ఇది రెండో గెలుపు. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 19.4 ఓవర్లలోనే కేవలం 137 పరుగులకే ఆలౌటైంది. మరోసారి స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో సన్‌రైజర్స్ ఘోరంగా విఫలమైంది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్‌కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టో శుభారంభం అందించారు. ఇద్దరు ముంబై బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించారు. ధాటిగా ఆడిన బెయిర్‌స్టో 22 బంతుల్లోనే మూడు ఫోర్లు, మరో నాలుగు సిక్సర్లతో 43 పరుగులు సాధించాడు. ఇదే క్రమంలో 7.1 ఓవర్లలోనే 67 పరుగులు జోడించాడు. కానీ కృనాల్ పాండ్య బౌలింగ్‌లో హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత హైదరాబాద్ మళ్లీ కోలుకోలేక పోయింది. కెప్టెన్ వార్నర్ రెండు ఫోర్లు, మరో రెండు సిక్స్‌లతో 36 పరుగులు చేసి రనౌటయ్యాడు. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన మనీష్ పాండే (2) నిరాశ పరిచాడు. ఒక్క విజయ్ శంకర్ మాత్రమే కాస్త రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న శంకర్ రెండు సిక్సర్లతో 28 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రాలు అద్భుతంగా బౌలింగ్ చేశారు. బౌల్ట్, చాహర్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి.
శుభారంభం..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబైకి ఓపెనర్లు డికాక్, రోహిత్ శర్మ మెరుగైన ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరు హైదరాబాద్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. ధాటిగా ఆడిన రోహిత్ రెండు సిక్సర్లు, మరో రెండు ఫోర్లతో 32 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇదే క్రమంలో తొలి వికెట్‌కు 55 పరుగులు జోడించాడు. మరోవైపు డికాక్ ఐదు బౌండరీలతో 40 పరుగులు చేశాడు. చివర్లో పొలార్డ్ మూడు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో అజేయంగా 35 పరుగులు చేయడంతో ముంబై స్కోరు 150 పరుగులకు చేరింది.
IPL 2021: MI win by 13 runs against SRH