ఉత్కంఠ పోరులో ఢిల్లీపై 4 వికెట్ల తేడాతో గెలుపు
చివరిలో మ్యాచ్‌ని మార్చేసిన కెప్టెన్
గైక్వాడ్, ఉతప్ప శతక భాగస్వామ్యం
దుబాయి: ధోనీ సేన ఐపిఎల్ 2021ఫైనల్‌కు చేరింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్సపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఆ జట్టు తొమ్మిదో సారి ఐపిఎల్ ఫైనల్ కు చేరినట్లుయింది. గతంలో జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించిన జట్టు సారథి ధోనీ మరోసారి తన సత్తా చాటాడు. చివరి ఓవర్లో విజయానికి 13 పరుగులు అవసరం కాగా టామ్ కర్రన్ వేసిన ఆ ఓవర్ తొలి బంతికే మోయిన్ అలీ ఔటయ్యాడు. ఈ స్థితిలో ఏ జట్టయినా అన్ని పరుగులు సాధించడం కష్టసాధ్యమే. అయితే మిస్టర్ కూల్ (ధోనీ) ముఖంలో మత్రం ఏ మాత్రం ఆందోళన కనిపించలేదు. ఆ తర్వాతి రెండు బంతులను బౌండరీలకు తరలించి అసాధ్యంగా కనిపించిన విజయాన్ని సుసాధ్యమన్నట్లు చేశాడు. ఆ స్థితిలో ఒత్తిడికి గురయిన కర్రన్ ఓ వైడ్ కూడా సమర్పించుకున్నాడు. ఓవర్లో నాలుగో బంతిని కూడా బౌండరీకి పంపించిన ధోనీ అద్భుత విజయాన్ని అందించాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ డుప్లెసిస్ కేవలం ఒక పరుగు చేసి నోట్జే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఆ తర్వాత వచ్చిన రాబిన్ ఉతప్ప మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి రెండో వికెట్‌కు 110 పరుగులు జోడించడం ద్వారా చెన్నైని విజయం ముంగిట నిలిపారు. అయితే 63 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాబిన్ ఉతప్ప కర్రన్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్ పట్టిన అద్భుత క్యాచ్‌తో ఔటయ్యాడు. ఉతప్ప స్కోరులో 7 బౌండరీలు, రెండు సిక్స్లున్నాయి. ఆ వెంటనే శార్దూల్ ఠాకూర్(0), అంబటి రాయుడు(1) కూడా పెవిలియన్ దారి పట్టడంతో ఢిల్లీ తిరిగి మ్యాచ్‌లో నిలిచింది. అయితే మోయిన్ అలీ తోడ్పాటుతో గైక్వాడ్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోవడమే కాకుండా జట్టుస్కోరును లక్షం దిశగా నడిపించాడు. ఈ దశలో అవేష్ ఖాన్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ క్యాచ్ పట్టడంతో గైక్వాడ్ ఔటయ్యాడు. గైక్వాడ్ 50 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 70 పరుగులు చేశాడు. ఆతర్వాత కొద్ది సేపటికే మోయిన్ అలీ(16) ఔటయ్యాడు. అయితే ధోనీ మ్యాచ్ మొత్తం స్వరూపాన్నే మార్చి వేశాడు. కేవలం 6 బంతుల్లో ఒక సిక్స్, 3 ఫోర్లతో 18 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపించాడు. జడేజా పరుగులేమీ చేయకుండా నాటౌట్‌గా నిలిచాడు.
రాణించిన షా, పంత్
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా, రిషబ్ పంత్‌లు అర్ధ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అయితే శిఖర్ ధావన్(7), శ్రేయస్ అయ్యర్(1), అక్షర్ పటేల్(10)లు నిరాశపరిచారు. ఢిల్లీక్యాపిటల్స్కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. శిఖర్ ధావన్ నెమ్మదిగా ఆడినా పృథ్వీ షా బౌండరీలతో విరుచుకు పడ్డాడు. హేజిల్‌వుడ్ వేసిన రెండో ఓవర్లో సిక్స్, ఫోర్ బాదిన షా దీపక్ చాహర్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో వరసగా నాలుగు బౌండరీలు కొట్టాడు. అయితే హేజిల్‌వుడ్ వేసిన నాలుగో ఓవర్లో ధావన్ ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనువిరిగాడు. శార్దూల్ ఢాకూర్ వేసిన ఐదో ఓవర్లో షా రెండు సిక్స్‌లు కొట్టాడు. ధాటిగా ఆడుతున్న పృథ్వీషాను 11వ ఓవర్లో జడేజా పెవిలియన్‌కు పంపాడు. షా 34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60 పరుగులు చేశాడు. ఆ తర్వాత పంత్, హెట్‌మయర్‌లు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు పరుగెత్తించారు. బ్రావో వేసిన 19వ ఓవర్లో హెట్మయర్ జడేజజాకు చిక్కాడు. హెట్మయర్ 24 బంతుల్లో 3ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 37 పరుగులు చేశాడు. 35 బంతుల్లో 3 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 51 పరుగులు చేసిన రిషబ్ పంత్ నాటౌట్‌గా నిలిచాడు. చెన్నై బౌలర్లలో హేజిల్‌వుడ్ రెండు, జడేజా, మోయిన్ అలీ, బ్రావో ఒక్కో వికెట్ పడగొట్టారు.
IPL 2021 Qualifier1: CSK Beat DC with 4 wickets