ముంబై: ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) విషయంలో తగ్గేదే లే అంటోంది బిసిసిఐ. భారత్ లో ఓ పక్క కరోనా విజృంభిస్తున్నా ఐపిఎల్ 14వ సీజన్ మాత్రం విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, ఒకేరోజు నలుగురు ఆటగాళ్లు సడెన్‌గా లీగ్‌ను వదిలి వెళ్లిపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్స్ ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్, రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ ఆండ్రూ టై లీగ్ నుంచి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. వీరిలో అశ్విన్, టై లు కొవిడ్ కారణంగా వెళ్లిపోతున్నామని తెలుపగా.. జంపా, రిచర్డ్‌సన్ వ్యక్తిగత కారణాలను చూపుతూ ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. దీంతో ఐపిఎల్ పై కరోనా ఎఫెక్ట్ పడిందని, ముందుముందు ఐపిఎల్ సజావుగా సాగుతుందో లేదోనని వార్తలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో బిసిసిఐ అధికారి ఒకరు స్పందించారు. ఐపిఎల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకూ ఐపిఎల్ లీగ్ సజావుగానే సాగుతోందని, ఆటగాళ్లు ఎవరైనా వెళ్లిపోవాలనుకుంటే వెళ్లిపోవచ్చు.. వాళ్లకు మేము అడ్డుపడమని చెప్పారు. ఐపిఎల్ మాత్రం కొనసాగుతుందని అధికారి పేర్కొన్నారు.
IPL 2021 Will continue says BCCI