అహ్మదాబాద్: ఐపిఎల్ సీజన్14లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐదో విజయం నమోదు చేసింది. మంగళవారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో బెంగళూరు ఒక పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చాలెంజర్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన స్టీవ్ స్మిత్ 4 పరుగులు చేసి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ పృథ్వీషా 3 ఫోర్లతో 21 పరుగులు చేసి పెవలియన్ చేరాడు. దీంతో ఢిల్లీ 47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను కెప్టెన్ రిషబ్ పంత్ తనపై వేసుకున్నాడు. అతనికి స్టోయినిస్ (22) అండగా నిలిచాడు. తర్వాత వచ్చిన షిమ్రోన్ హెట్‌మెయిర్ అసాధారణ బ్యాటింగ్‌ను కనబరచడంతో ఢిల్లీ గెలుపు ఆశలు మళ్లీ చిగురించాయి. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన హెట్‌మెయిర్ 25 బంతుల్లోనే 4 భారీ సిక్సర్లు, మరో రెండు ఫోర్లతో అజేయంగా 53 పరుగులు చేశాడు. కెప్టె న్సీ ఇన్నింగ్స్ ఆడిన రిషబ్ ఆరు ఫోర్లతో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆఖరి ఓవర్లలో విజయం కోసం 14 పరుగులు అవసరం కాగా, సిరాజ్ అద్భుత బౌలింగ్‌తో ఢిల్లీని ఆ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరును డివిలియర్స్ ఆదుకున్నాడు. చెలరేగి ఆడిన డివిలియర్స్ 42 బంతుల్లోనే ఐదు సిక్సర్లు, మరో మూడు ఫోర్లతో అజేయంగా 75 పరుగులు చేయడంతో బెంగళూరు భారీ స్కోరును సాధించింది.
IPL 2021:RCB won by 1 run against DC