ముంబై: ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 12 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. అలవోకగా గెలవాల్సిన మ్యాచ్‌లో హైదరాబాద్ చేజేతులా ఓటమిని కొనితెచ్చుకొంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(13), కేన్ విలియమ్సన్(16) మరోసారి విఫలమయ్యారు. జట్టును ఆదుకుంటాడని భావించిన ఐడైన్ మార్‌క్రామ్ కూడా నిరాశ పరిచాడు. అతను 12 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. మరోవైపు రాహుల్ త్రిపాటి, నికోలస్ పూరన్ మాత్రమే మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచారు. ఇద్దరు లక్నో బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ జట్టు గెలుపుకోసం ప్రయత్నించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ త్రిపాఠి ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 44 పరుగులు చేశాడు. మరోవైపు పూరన్ 3 ఫోర్లు, రెండు సిక్సర్లతో 34 పరుగులు సాధించాడు. వాషింగ్టన్ సుందర్ ఒక బౌండరీతో 18 పరుగులు చేశాడు. ఇక అబ్దుల్ సమద్(0), షెఫర్డ్(8), భువనేశ్వర్ కుమార్(1) విఫలమయ్యారు. లక్నో జట్టులో అవేశ్ ఖాన్ నాలుగు, హోల్డర్ మూడు, కృనాల్ రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లక్నోను కెప్టెన్ కెఎల్ రాహుల్, దీపక్ హుడా ఆదుకున్నారు. ఆరంభంలో హైదరాబాద్ బౌలర్లు చెలరేగడంతో లక్నో 11 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రాహుల్ (68), దీపక్ (51) అర్ధ సెంచరీలతో జట్టుకు అండగా నిలిచారు.
IPL 2022: LSG Win by 12 Runs against SRH