ముంబై: ఐపిఎల్ సీజన్15లో పంజాబ్ కింగ్స్ నాలుగో విజయం నమోదు చేసింది. సోమవారం ఇక్కడి వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 11 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె)ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన చెన్నై నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ రాబిన్ ఉతప్ప(1), వన్‌డౌన్‌లో వచ్చిన మిఛెల్ సాంట్నర్ (9), శివమ్ దూబే (8) నిరాశ పరిచారు. మరోవైపు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(30) పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక సిఎస్‌కె టీమ్‌లో అంబటి రాయుడు ఒక్కడే పోరాటం చేశాడు. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న రాయుడు 39 బంతుల్లోనే ఆరు భారీ సిక్సర్లు, ఏడు ఫోర్లతో 78 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ను ఓపెనర్ శిఖర్ ధావన్ ఆదుకున్నాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన ధావన్ 59 బంతుల్లోనే 9 ఫోర్లు, రెండు సిక్సర్లతో 88 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రాజపక్సా (42), లివింగ్‌స్టోన్ (19) అతనికి అండగా నిలిచారు.
IPL 2022: PBKS Win by 11 runs against CSK