న్యూఢిల్లీ: ఐపిఎల్ 2022 మెగా టోర్నీలో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం తమ జట్టుకు యువ ఆటగాడు మయాంక్ అగర్వాల్‌ను కెప్టెన్ గా నియమించింది. ఈ విషయాన్ని సోమవారం పంజాబ్ కింగ్స్ టీమ్ మేనేజ్‌మెంట్ ట్వీటర్ ద్వారా వెల్లడించింది. ఇప్పటివరకు పంజాబ్ కు సారథిగా ఉన్న కెఎల్ రాహుల్ ను ఇటీవల జరిగిన ఐపిఎల్ యాక్షన్ లో లఖ్ నవూ సూపర్ జాయింట్స్ కొనుగోలు చేసింది. అలాగే, కెప్టెన్ బాధ్యతలను కూడా అప్పగించింది. ఈ నేపథ్యంలో పంజాబ్ కు నూతన కెప్టెన్ గా మయాంక్ ను నియమించింది. 2018 నుంచి మయాంక్ అగర్వాల్ పంజాబ్ జట్టుకు ఆడుతున్నాడు. పలుసార్లు కెఎల్ రాహుల్ అందుబాటులో లేనప్పుడు మయాంక్ జట్టును నడిపించాడు. ఇక, పంజాబ్ కు సారథ్య బాధ్యతులు చేపట్టనుండడంపై మయాంక్ సంతోషం వ్యక్తం చేశాడు. జట్టుకు నాయకత్వం వహించే అవకాశం లభించినందుకు గర్వంగా కూడా ఉందని మయాంక్ పేర్కొన్నాడు. కాగా, ఐపిఎల్ వేలానికి ముందు పంజాబ్ జట్టు మయాంక్‌ను రూ.14 కోట్లకు రిటైన్ చేసుకుంది.
IPL 2022: Punjab Kings Appoint Mayank Agarwal As Captain