Sunday, January 19, 2025

బెంగళూరు ఘన విజయం..

- Advertisement -
- Advertisement -

IPL 2022: RCB Win by 67 runs against SRH

రాణించి హసరంగ.. చెలరేగిన బ్యాటర్లు
సన్‌రైజర్స్‌పై 67 పరుగుల తేడాతో విజయం

ముంబై: ఐపిఎల్ 2022 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. బెంగళూరు బౌలర్లు వానిండు హసరంగ(5/18), హజిల్‌వుడ్(2/17)ల ధాటికి పూర్తి ఓవర్లు కూడా ఆడకుండానే చాపచుట్టేసింది. రాహుల్ త్రిపాటి(58), మార్‌క్రామ్(21) పూరన్(18)లు తప్ప మెరవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. అంతేకాదు నలుగురు బాటర్లు డకౌట్ కావడంతో 125 పరగులకే ఆల్ అవుట్ అయ్యింది. దీంతో బెంగళూరు జట్టు 67 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది.
చెలరేగిన బ్యాటర్లు..
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరులో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(0) విఫలమైనా.. కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(50 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 73 నాటౌట్), రజత్ పటిదార్(38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48) రాణించారు. దాంతో సన్‌రైజర్స్ ముందు బెంగళూరు 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. వీరికి తోడు చివర్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), దినేశ్ కార్తీక్(8 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 30 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో జగదీష సుచిత్ రెండు వికెట్లు తీయగా.. కార్తీక్ త్యాగీ ఓ వికెట్ పడగొట్టాడు.
ఫాఫ్ హాఫ్ సెంచరీ..
ఉమ్రాన్ మాలిక్ వేసిన 8వ ఓవర్‌లో అతని పేస్‌ను అడ్వాంటేజ్‌గా మార్చుకున్న బెంగళూరు బ్యాటర్లు.. 20 పరుగులు పిండుకున్నారు. రజత్ ఓ బౌండరీ బాదగా.. డూప్లెసిస్ 4, 4, 6 హ్యాట్రిక్ బౌండరీలు బాదాడు. కార్తీక్ త్యాగి వేసిన 12వ ఓవర్ నాలుగో బంతిని బౌండరీ బాదిన ఫాఫ్ డూప్లెసిస్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే సుచిత్ వేసిన ఆ మరుసటి ఓవర్‌లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో రజత్ పటిదార్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. 2 పరుగుల వ్యవధిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 105 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

కార్తీక్ మెరుపులు..
చివర్లో క్రీజులోకి వచ్చిన గ్లేన్ మ్యాక్స్‌వెల్ వచ్చిరావడంతోనే స్విచ్ హిట్‌తో భారీ సిక్సర్ బాదాడు. ఫాఫ్ సైతం బ్యాటింగ్‌లో జోరు పెంచడంతో స్కోర్ బోర్డు పరుగెత్తింది. ధాటిగా ఆడే క్రమంలో కార్తీక్ త్యాగీ వేసిన 19వ ఓవర్‌లో మ్యాక్స్‌వెల్ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ భారీ సిక్సర్ బాదాడు. ఫరూఖీ వేసిన ఆఖరీ ఓవర్‌లో బౌండరీ లైన్ మీద దినేశ్ కార్తీక్ ఇచ్చిన లాలిపాప్ క్యాచ్‌ను రాహుల్ త్రిపాఠి వదిలేయడంతో బెంగళూరు 6 పరుగులు వచ్చాయి. ఈ అవకాశాన్ని అందుకున్న కార్తీక్ మరో రెండు సిక్స్‌లతో పాటు ఒక బౌండరీ బాది బెంగళూరుకు భారీ స్కోర్ అందించాడు.

విరాట్ గోల్డెన్ డక్..
బెంగళూరుకు ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్‌కే గట్టి షాక్ తగిలింది. జగదీశ్ సుచిత్ వేసిన తొలి బంతికే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. ఈ సీజన్‌లో హైదరాబాద్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో విరాట్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రజత్ పటిదార్‌తో కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరూ సన్‌రైజర్స్ బౌర్లపై ఎదురుదాడికి దిగడంతో బెంగళూరు పవర్‌ప్లేలో వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది.

IPL 2022: RCB Win by 67 runs against SRH

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News