ముంబై: ఐపిఎల్ సీజన్15లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవమైన ఆటతో అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఐపిఎల్ మెగా వేలం పాటలో ప్రతిభావంతులైన క్రికెటర్లను కొనుగోలు చేయడంలో సన్‌రైజర్స్ యాజమాన్యం విఫలమైన విషయం తెలిసిందే. దీని ప్రభావం ఐపిఎల్ టోర్నీలో స్పష్టంగా కనబడుతోంది. ఒకప్పుడూ స్టార్ క్రికెటర్లతో నిండివున్న హైదరాబాద్ ప్రస్తుతం అనామక జట్టుగా మారిపోయింది. డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్, బెయిర్‌స్టో, హోల్డర్, మనీష్ పాండే, నబి వంటి స్టార్ క్రికెటర్లు ప్రస్తుతం జట్టుకు అందుబాటులో లేకుండాపోయారు. ప్రస్తుత జట్టులో కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఒక్కడే కాస్త మెరుగైన ఆటగాడిగా ఉన్నాడు. విండీస్ స్టార్ నికోలస్ పూరన్ ఉన్నా అతను ఆడిన రెండు మ్యాచుల్లోనూ నిరాశ పరిచాడు. మార్‌క్రామ్ రెండో మ్యాచ్‌లో తేలిపోయాడు. వాషింగ్టన్ సుందర్ ఉన్నా పెద్దగా ఫలితం కనబడడం లేదు. ఇతర జట్లు వేలం పాటలో ప్రతిభావంతులైన ఆటగాళ్లను కొనుగోలు చేయడంలో సఫలం కాగా సన్‌రైజర్స్ మాత్రం ఆ విషయంలో పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. చేతి నిండ డబ్బులు ఉన్నా ఆటగాళ్ల కొనుగోళ్లలో యాజమాన్యం పూర్తిగా తేలిపోయింది.
రాహుల్ త్రిపాఠి, సుందర్, అభిషేక్ శర్మ, షెఫర్డ్ వంటి ఆటగాళ్ల కోసం సన్‌రైజర్స్ కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. అయితే వీరి ప్రతిభ ఏపాటిదో ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచుల్లో తేలిపోయింది. జట్టును ముందుండి నడిపించడంలో కెప్టెన్ కేన్ విలియమ్స్ ఘోరంగా విఫలమవుతున్నాడు. అతని సారథ్యంలో హైదరాబాద్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోతోంది. రెండు మ్యాచుల్లోనూ హైదరాబాద్ అ త్యంత పేలవమైన ఆటను కనబరిచింది. ఇక లక్నోతో జరిగిన మ్యాచ్‌లో గెలిచే స్థితిలో ఉండి కూడా చేజేతులా ఓటమి పాలైంది. ప్రతిభావంతులైన బ్యాటర్లు లేని లోటు స్పష్టంగా కనిపించింది. సమద్, అభిషేక్ శర్మలు చెత్త ఆటతో నిరాశ పరుస్తున్నారు. బౌలర్లు కాస్త బాగానే రాణిస్తున్నా బ్యాటింగ్ వైఫల్యం హైదరాబాద్‌కు ప్రధాన లోపంగా మారింది. విధ్వంసకర బ్యాటింగ్‌ను కనబరిచే ఆటగాళ్లు ఒక్కరంటే ఒకరూ కూడా హైదరాబాద్‌లో లేరంటే అతిశయోక్తి కాదు. ఒక్క పూరన్‌కు మాత్రమే మెరుపులు మెరిపించే సత్తా ఉంది. అతను కూడా తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచడంలో విఫలమవుతున్నాడు. ఇదిలావుండగా అంతంత మాత్రం ఆటతో సతమతమవుతున్న హైదరాబాద్‌కు రానున్న మ్యాచ్‌లు సవాల్ వంటివే.
IPL 2022: SRH Players failed vs LSG