Wednesday, December 25, 2024

అదరగొట్టిన చెన్నై.. ముంబైపై ఘన విజయం

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపిఎల్‌లో భాగంగా శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో చెన్నైకి ఇది ఆరో విజయం కావడం విశేషం. మరోవైపు ఇండియన్స్ ఐదో ఓటమిని చవిచూసింది. ముంబైపై గెలిచిన చెన్నై పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం 11 మ్యాచుల్లో 13 పాయింట్లు సాధించింది. గుజరాత్ 14 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. సిఎస్‌కె బౌలర్లు ఆరంభం నుంచే వరుస క్రమంలో వికెట్లు తీశారు. ఓపెనర్‌గా వచ్చిన కామెరూన్ గ్రీన్ ఆరు పరుగులు మాత్రమే చేసి తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (7) కూడా వెనుదిరిగాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఈ రెండు వికెట్లను దీపక్ చాహర్ పడగొట్టాడు.

దీంతో ముంబై 14 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో స్కోరును ముందుకు తీసుకెళ్లే బాధ్యతను సూర్యకుమార్ యాదవ్, నెహాల్ వధెరా తమపై వేసుకున్నార. ఇద్దరు చెన్నై బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. అయితే 3 ఫోర్లతో 26 పరుగులు చేసిన సూర్యకుమార్‌ను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. అతను ఔటైనా నెహాల్ తన పోరాటాన్ని కొనసాగించాడు. ట్రిస్టన్ స్టబ్స్ అండతో మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన నెహాల్ వధెరా 51 బంతుల్లో ఒక సిక్సర్, మరో 8 ఫోర్లతో 64 పరుగులు చేసి ఔటయ్యాడు. స్టబ్స్ రెండు సిక్సర్లతో 20 పరుగులు చేశాడు. తర్వాత వచ్చిన బ్యాటర్లు విఫలం కావడంతో ముంబై ఇన్నింగ్స్ 139 పరుగులకే పరిమితమైంది. సిఎస్‌కె బౌలర్లలో మతీషా పతిరణ 15 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. చాహర్, తుషార్ పాండేలకు రెండేసి వికెట్లు దక్కాయి.

శుభారంభం..
తర్వాత లక్షఛేదనకు దిగిన చెన్నైకి ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవోన్ కాన్వే శుభారంభం అందించారు. ఇద్దరు తమ అద్భుత ఫామ్‌ను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించారు. రుతురాజ్ దూకుడుగా ఆడగా, కాన్వే సమన్వయంతో బ్యాటింగ్ చేశాడు. చెలరేగి ఆడిన గైక్వాడ్ 16 బంతుల్లోనే 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన కాన్వే 4 ఫోర్లతో 44 పరుగులు చేశాడు. మరోవైపు అజింక్య రహానె (21), అంబటి రాయుడు (12), శివమ్ దూబే 26 (నాటౌట్) తమవంతు సహకారం అందించారు. కాగా, ముంబై బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలిగ్ చేయడంతో చెన్నై స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా కాస్త శ్రమించాల్సి వచ్చింది. ఇక అద్భుత బౌలింగ్‌తో చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించిన పతిరణకు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News