Friday, November 22, 2024

పంజాబ్‌కు చాలా కీలకం.. నేడు చెన్నైతో పోరు

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపిఎల్‌లో భాగంగా ఆదివారం జరిగే తొలి మ్యాచ్‌లో పటిష్టమైన చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె)తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకోవాలనే పట్టుదలతో చెన్నై ఉండగా పంజాబ్ కూడా విజయమే లక్షంగా పోరకు సిద్ధమైంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకమనే చెప్పాలి. ఈ సీజన్‌లో చెన్నై ఇప్పటి వరకు నాలుగు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో నిలిచింది. మరోవైపు పంజాబ్ మూడు విజయాలతో నాకౌట్ రేసులో కొనసాగుతోంది. ప్లేఆఫ్‌కు చేరాలంటే ఇకపై జరిగే అన్ని మ్యాచుల్లోనూ మెరుగైన ప్రదర్శన చేయాల్సిన పరిస్థితి పంజాబ్‌కు నెలకొంది. లక్నోతో జరిగిన కిందటి మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 257 పరుగుల రికార్డు స్కోరును నమోదు చేసింది. ఇక పంజాబ్ కూడా బాగానే బ్యాటింగ్ చేసింది. చివరి వరకు గెలుపు కోసం పోరాడింది.

Also Read: అగ్రస్థానానికి గుజరాత్..

అయితే కీలక సమయంలో వికెట్లు కోల్పోవడంతో పంజాబ్‌కు 56 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. ఇలాంటి స్థితిలో బలమైన చెన్నైతో జరిగే పోరు పంజాబ్‌కు సవాల్ వంటిదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో నిలకడైన ప్రదర్శన చేస్తేనే పంజాబ్‌కు ఈ మ్యాచ్‌లో గెలుపు అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌కు ఓపెనర్ల కీలకంగా మారారు. కిందటి మ్యాచ్‌లో ఓపెనర్లు ప్రభుసిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్‌లు విఫలమయ్యారు. కెప్టెన్ ధావన్ జట్టును ముందుండి నడిపించడంలో విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అతర్వ టైడ్, సికందర్ రజా, లివింగ్‌స్టోన్, శామ్ కరన్, జితేష్ శర్మ, షారుక్ ఖాన్ తదితరులతో పంజాబ్ బ్యాటింగ్ బలంగానే ఉంది. అయితే బ్యాటర్లు నిలకడగా రాణించడంలో విఫలమవుతున్నారు.

ఇది జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా షారుక్ ఖాన్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. ఈ సీజన్‌లో షారుక్ ఒక్క మ్యాచ్‌లో కూడా తన స్థాయికి తగ్గ ఆటను కనబరచలేక పోయాడు. కనీసం మిగిలిన మ్యాచుల్లోనైనా అతను మెరుగైన ప్రదర్శన చేయక తప్పదు. కాగా, కిందటి మ్యాచ్‌లో బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడం కూడా ఆందోళనకు గురి చేస్తోంది. ఈ మ్యాచ్‌లో బౌలర్లు మెరుగైన బౌలింగ్‌ను కనబరచాల్సి ఉంటుంది. లేకుంటే మరోసారి ఇబ్బందులు తప్పక పోవచ్చు.

ఫేవరెట్‌గా..
మరోవైపు ఈ మ్యాచ్‌లో చెన్నై ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చెన్నై సమతూకంగా ఉంది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, కాన్వేలు అద్భుత ఫామ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో కూడా వీరు జట్టుకు కీలకంగా మారారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే వీరిలో ఏ ఒక్కరూ నిలదొక్కుకున్నా జట్టుకు భారీ స్కోరు ఖాయం. ఈ సీజన్‌లో అజింక్య రహానె ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు.

కోల్‌కతాతో జరిగిన కిందటి మ్యాచ్‌లోనూ రహానె విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించాడు. శివమ్ దూబే, జడేజా, ధోనీ, మోయిన్ అలీ, రాయుడు తదితరులతో చెన్నై బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక మహీశ్ తీక్షణ, జడేజా, మోయిన్ అలీ, ఆకాశ్ దీప్, పతిరణ తదితరులతో బౌలింగ్ విభాగం కూడా బలోపేతంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లో చెన్నైకే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News