Sunday, December 22, 2024

సమరోత్సాహంతో చెన్నై… నేడు రాజస్థాన్‌తో పోరు

- Advertisement -
- Advertisement -

జైపూర్: వరుస విజయాలతో జోరుమీదున్న చెన్నై సూపర్ కింగ్స్ గురువారం రాజస్థాన్ రాజస్థాన్‌తో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంంది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన చెన్నై ఐదింటిలో విజయం సాధించి అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు రాజస్థాన్ నాలుగు విజయాలతో మూడో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిచి మళ్లీ గాడిలో పడాలనే పట్టుదలతో రాజస్థాన్ ఉంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఇరు జట్ల ఓపెనర్లు అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోతున్నారు. జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్‌లు రాజస్థాన్‌కు అండగా నిలుస్తున్నారు. చెన్నై ఓపెనర్లు డెవోన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్‌లు కూడా జోరుమీదున్నారు. రెండు జట్లు కూడా బ్యాటర్లపైనే ఆశలు పెట్టుకున్నాయి.

కాన్వే, మోయిన్ అలీ, రాయుడు, జడేజా, శివమ్‌దూబే, ధోనీ తదితరులతో చెన్నై బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే కాన్వే, రుతురాజ్‌లు చెలరేగితే ఈ మ్యాచ్‌లోనూ చెన్నైకి తిరుగుండదు. అజింక్య రహానె ఈ సీజన్‌లో విధ్వంసక బ్యాటింగ్‌తో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. అసాధారణ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్టు బౌలర్లను హడలెత్తిస్తున్నాడు. మరోవైపు జడేజా ఇటు బ్యాట్‌తో అటు బంతితో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ఆల్‌రౌండ్‌షోతో చెన్నై విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా జట్టుకు కీలకంగా మారాడు. తీక్షణ, పతిరణ, మోయిన్ అలీ తదితరులతో చెన్నై బౌలింగ్ కూడా బాగానే ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో సిఎస్‌కె ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

తక్కువ అంచనా వేయలేం..
మరోవైపు రాజస్థాన్‌ను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు రాజస్థాన్‌లో కొదవలేదు. ఓపెనర్లు బట్లర్, జైస్వాల్‌లు జోరుమీదున్నారు. ఈసారి కూడా శుభారంభం అందించాలనే పట్టుదలతో ఉన్నారు. దేవ్‌దుత్ పడిక్కల్, కెప్టెన్ సంజూ శాంసన్, హెట్‌మెయిర్, ధ్రువ్ జురేల్, అశ్శిన్‌లతో రాజస్థాన్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక బౌల్ట్, అశ్విన్, చాహల్, హోల్డర్, సందీప్ శర్మ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. దీనికి తోడు సొంత గడ్డపై ఆడుతుండడం ఆ జట్టుకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. ఇరు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News