Wednesday, January 22, 2025

ఢిల్లీకి సవాల్.. నేడు గుజరాత్ ఢీ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తొలి మ్యాచ్‌లో చెన్నై వంటి బలమైన జట్టుపై అలవోక విజయం సాధించి జోరుమీదున్న డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో మంగళవారం జరిగే మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు సవాల్‌గా మారింది. ఇప్పటికే ఢిల్లీ మొదటి మ్యాచ్‌లో లక్నో చేతిలో ఓటమి పాలైంది. దీంతో గుజరాత్‌తో జరిగే మ్యాచ్ ఢిల్లీకి కీలకంగా తయారైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టాలనే పట్టుదలతో ఢిల్లీ ఉంది. కిందటి మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆశించిన స్థాయిలో రాణించలేక పోయింది. ఖలీల్ అహ్మద్ ఒక్కడే కాస్త మెరుగ్గా బౌలింగ్ కనబరిచాడు. ముకేశ్ కుమార్, చేతన్ సకారియా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తదితరులు తమ స్థాయికి తగ్గ బౌలింగ్‌ను కనబరచలేక పోయారు.

దీంతో ఆరంభ మ్యాచ్‌లో లక్నో 193 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఇక బ్యాటింగ్‌లోనూ ఢిల్లీ అంతంత మాత్రంగానే రాణించింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన వార్నర్ ఏడు ఫోర్లతో 56 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిఛెల్ మార్ష్,పృథ్వీషా, సర్ఫరాజ్ ఖాన్, పొవెల్, అక్షర్ పటేల్ తదితరులు బ్యాట్‌తో రాణించలేక పోయారు. రొసొ మాత్రం కాస్త పర్వాలేదనిపించాడు. ఇలా లక్నో మ్యాచ్‌లో బ్యాట్‌తో బంతితో ఢిల్లీ ఆటగాళ్లు తేలిపోయారు. ఇలాంటి స్థితిలో గుజరాత్ వంటి బలమైన జట్టుతో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించడం అనుకున్నంత తేలికేం కాదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అసాధారణ ఆటను కనబరిస్తేనే ఈ మ్యాచ్‌లో ఢిల్లీకి గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. లేకుంటే వరుసగా రెండో ఓటమి ఖాయం.

ఆత్మవిశ్వాసంతో..
ఇక తొలి మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకున్న గుజరాత్ ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో గుజరాత్ సమతూకంగా కనిపిస్తోంది. ఢిల్లీతో పోల్చితే గుజరాత్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్య, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, సాయి సుదర్శన్ తదతరులతో గుజరాత్ బ్యాటింగ్ బలంగా ఉంది. ఇక సాహా రూపంలో సీనియర్ ఆటగాడు కూడా జట్టుకు అందుబాటులో ఉన్నాడు. అంతేగాక షమి, హార్దిక్, జోపెఫ్, రషీద్ ఖాన్‌లతో బౌలింగ్ విభాగం కూడా పట్టిష్టంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో గుజరాత్ ఈ మ్యాచ్‌లో కూడా విజయమే లక్షంగా పెట్టుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News