Sunday, January 19, 2025

IPL 2023: నేడు రాజస్థాన్‌తో ఢిల్లీ పోరు..

- Advertisement -
- Advertisement -

గౌహతి: వరుస ఓటములతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్ సవాల్‌గా మారింది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి బోణీ కొట్టాలని ఢిల్లీ తహతహలాడుతోంది. ఢిల్లీ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఢిల్లీకి ఓటమి ఎదురైంది. ఇలాంటి స్థితిలో రాజస్థాన్‌తో పోరు చాలా కీలకంగా తయారైంది. గౌహతి వేదికగా మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఈ మ్యాచ్ జరుగనుంది.

మరోవైపు కిందటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో పోరాడి ఓడిన రాజస్థాన్‌కు కూడా ఈ పోరు కీలకమే. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఢిల్లీతో పోల్చితే రాజస్థాన్ అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. ఢిల్లీలో కూడా ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నా సమష్టిగా పోరాడడంలో జట్టు విఫలమవుతోంది. అయితే రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో మాత్రం విజయం సాధించాలనే పట్టుదలతో ఢిల్లీ పోరుకు సిద్ధమైంది.

బ్యాటింగే సమస్య..
ఢిల్లీ టీమ్‌ను బ్యాటింగ్ సమస్య వెంటాడుతోంది. ఓపెనర్ పృథ్వీ షా, డాషింగ్ ఆల్‌రౌండర్ మిఛెల్ మార్ష్ వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ వీరిద్దరూ ఘోరంగా విఫలమయ్యారు. పృథ్వీ షా తొలి మ్యాచ్‌లో 12, రెండో మ్యాచ్‌లో ఏడు పరుగులు మాత్రమే చేశాడు. ఇక మార్ష్ తొలి మ్యాచ్‌లో ఖాతానే తెరవలేదు. గుజరాత్‌పై 4 పరుగులకే ఔటయ్యాడు. మరో స్టార్ ఆటగాడు రొసొ కూడా ఈ మ్యాచ్‌లో సున్నాకే ఔటయ్యాడు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ రెండు మ్యాచుల్లో కాస్త బాగానే ఆడాడు.

అయితే అతని బ్యాటింగ్‌లో ఒకప్పటి దూకుడు కనిపించడం లేదు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా అతను తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేగాక అభిషేక్ పొరెల్, అక్షర్ పటేల్‌లు కూడా జట్టుకు కీలకంగా మారారు. ఇదిలావుంటే బౌలింగ్ సమస్య కూడా ఢిల్లీకి ప్రతికూలంగా మారింది. ముకేశ్ కుమార్, నోర్జే, ఖలీల్, మిఛెల్ మార్ష్, కుల్దీప్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలను మెరుగుపరుచుకుంటేనే ఢిల్లీకి గెలుపు అవకాశాలు అధికంగా ఉంటాయి. లేకుంటే మరో ఓటమి ఖాయం.

విజయమే లక్ష్యంగా..
మరోవైపు రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఢిల్లీతో పోల్చితే రాజస్థాన్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉంది. జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, దేవ్‌దుత్ పడిక్కల్, రియాన్ పరాగ్, హెట్‌మెయిర్, ధ్రువ్ జురేల్, జేసన్ హోల్డర్ వంటి విధ్వంసక బ్యాటర్లు జట్టులో ఉన్నారు. కిందటి మ్యాచ్‌లో మాత్రం యశస్వి, బట్లర్‌లు ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. ఈసారి మాత్రం మెరుపులు మెరిపించాలనే పట్టుదలతో ఉన్నారు. అంతేగాక అశ్విన్, బౌల్ట్, హోల్డర్, చాహల్ తదితరులతో బౌలింగ్ కూడా బలంగానే ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌కే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News