క్రీడా విభాగం: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి20 టోర్నమెంట్‌లో తనకు ఎదురు లేదని చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) మరోసారి నిరూపించింది. ఐపిఎల్‌లో ఐదో సారి ట్రోఫీని ముద్దాడి మహేంద్ర సింగ్ ధోని సేన సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఐపిఎల్‌లో ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ కూడా ఐదు సార్లు ట్రోఫీలను గెలుచుకుంది.
తాజాగా చెన్నై ఐదు ట్రోఫీలతో ముంబైతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఐపిఎల్ సీజన్16లో చెన్నై ఆరంభం నుంచే అత్యంత నిలకడైన ఆటను కనబరిచింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణిస్తూ లక్షం దిశగా అడుగులు వేసింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో చివరి బంతికి విజయం సాధించి ఐపిఎల్ ఛాంపియన్‌గా అవతరించింది. కిందటి సీజన్‌లో అత్యంత పేలవమైన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంతో సరిపెట్టుకున్న చెన్నై ఈసారి మాత్రం అసాధారణ ఆటతో ఆకట్టుకుంది.