Monday, December 23, 2024

ఎవరు గెలిచినా రికార్డే

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్ : ఐపిఎల్ సీజన్16 ముగింపు దశకు చేరుకుంది. దాదాపు రెండు నెలల పాటు అభిమానులను కనువిందు చేసిన ఐపిఎల్ టి20 టోర్నమెంట్‌కు ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె)గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగే ఫైనల్‌తో తెరపడనుంది. చెన్నై ఇప్పటికే నాలుగు టైటిల్స్‌ను గెలవగా డిఫెండింగ్ ఛాంపియన్ టైటాన్స్ ఆడిన రెండు సీజన్‌లలో ఫైనల్‌కు చేరి ప్రకంపనలు సృష్టించింది. ఐపిఎల్ చరిత్రలో చెన్నై ఇప్పటి వరకు నాలుగు సార్లు ట్రోఫీలు గెలుచుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో కూడా గెలిచి ముంబై ఇండియన్స్ పేరిట ఉన్న అత్యధిక టైటిల్స్ రికార్డును సమం చేయాలని తహతహలాడుతోంది. ముంబై ఐదు ఐపిఎల్ టైటిల్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

మరోవైపు గుజరాత్ కిందటి సీజన్‌లోనే ఐపిఎల్‌కు శ్రీకారం చుట్టింది. తొలి టోర్నమెంట్‌లోనే ట్రోఫీని సాధించి చరిత్ర సృష్టించింది. ఈసారి కూడా గెలిచి తన ఖాతాలో రెండో టైటిల్‌ను జత చేసుకోవాలని భావిస్తోంది. లీగ్ దశలో గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. 14 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ పదింటిలో జయకేతనం ఎగుర వేసింది. ఇక సిఎస్‌కె 17 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య చెన్నై వేదికగా జరిగిన తొలి క్వాలిఫయర్‌లో సిఎస్‌కె జయకేతనం ఎగుర వేసి ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు గుజరాత్ రెండో క్వాలిఫయర్‌లో ముంబైను చిత్తు చేసి తుది పోరుకు దూసుకొచ్చింది. ఇరు జట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ సమరం జరుగనుంది. రెండు టీమ్‌లలో కూడా ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో తుది పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.
భారీ ఆశలతో సిఎస్‌కె
క్వాలిఫయర్1లో గుజరాత్‌ను అలవోకగా ఓడించిన చెన్నై ఫైనల్లోనూ అదే సంప్రదాయా న్ని కొనసాగించాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సిఎస్‌కె సమతూకంగా కనిపిస్తోంది. ఓపెనర్లు డెవోన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్‌లు జోరుమీదున్నారు. జట్టును ఫైనల్‌కు చేర్చడంలో వీరిద్దరూ ముఖ్య భూమిక పోషించారు. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. రుతురాజ్, కాన్వేలు మరోసారి విజృంభిస్తే ఈ మ్యాచ్‌లో కూడా చెన్నైకి శుభారంభం ఖాయం. ఇక శివమ్ దూబే, రహానె, రాయుడు, కెప్టెన్ ధోనీలతో చెన్నై బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక మోయిన్ అలీ, జడేజా, దీపక్ చాహర్‌ల రూపంలో మ్యాచ్ విన్నర్ ఆల్‌రౌండర్లు ఉన్నారు. ఇక పతిరణ, మహీశ్ తీక్షణ, జడేజా, తుషార్, దీపక్‌లతో బౌలింగ్ కూడా బలంగానే ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో సిఎస్‌కె ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.
ప్రతీకారం కోసం..
మరోవైపు క్వాలిఫయర్1లో చెన్నై చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్‌కు సిద్ధమైంది. ముంబై వంటి బలమైన జట్టును క్వాలిఫయర్2లో టైటాన్స్ చిత్తుగా ఓడించింది. దీంతో హార్దిక్ సేన ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ భీకర ఫామ్‌లో ఉండడం గుజరాత్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. ఈ సీజన్‌లో శుభ్‌మన్ రికార్డు స్థాయిలో మూడు శతకాలు నమోదు చేశాడు. ముంబైతో జరిగిన కిందటి మ్యాచ్‌లో కూడా గిల్ కళ్లు చెదిరే శతకం సాధించాడు. ఫైనల్లో కూడా చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాడు. వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్య, రషీద్ ఖాన్, విజయ్ శంకర్, తెవాటియా, మిల్లర్ తదితరులతో గుజరాత్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక రషీద్, మోహిత్ శర్మ, జోషువా లిటిల్, నూర్ అహ్మద్, షమి వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టుకు అందుబాటులో ఉన్నారు. అంతేగాక సొంత గడ్డపై ఆడనుండడం గుజరాత్‌కు మరింత కలిసి వచ్చే అంశంగా చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News