కోల్‌కతా: ఐపిఎల్ సీజన్16లో డిఫెండింగ్ గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. శనివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో గుజరాత్ ఏడు వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో గుజరాత్ 12 పాయింట్లతో మొదటి స్థానానికి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన గుజరాత్ 17.5 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్, కెప్టెన్ హార్దిక్ పాండ్యలతో పాటు. విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్‌లు బ్యాట్‌తో రాణించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన గిల్ 35 బంతుల్లో 8 ఫోర్లతో 49 పరుగులు చేశాడు.
మరోవైపు కెప్టెన్ హార్దిక్ 26 పరుగులు సాధించాడు. మరోవైపు విజయ్ శంకర్ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగి పోయాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన శంకర్ 24 బంతుల్లోనే ఐదు సిక్సర్లు, రెండు ఫోర్లతో 51 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు ధాటిగా బ్యాటింగ్ చేసిన డేవిడ్ మిల్లర్ రెండు సిక్సర్లు, 2 ఫోర్లతో అజేయంగా 32 పరుగులు సాధించాడు. దీంతో గుజరాత్ మరో 2.1 ఓవర్లు మిగిలివుండగానే ఘన విజయం అందుకుంది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా టీమ్‌ను ఓపెనర్ రహ్మతుల్లా గుర్బాజ్ ఆదుకున్నాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న గుర్బాజ్ 39 బంతుల్లోనే ఏడు భారీ సిక్సర్లు, మరో ఐదు ఫోర్లతో 81 పరుగులు చేశాడు. కెప్టెన్ నితీష్ రాణా, శార్దూల్ ఠాకూర్ (0), వెంకటేష్ అయ్యర్ (11) విఫలమయ్యారు. రింకు సింగ్ (19), ఓపెనర్ జగదీశన్ కూడా నిరాశ పరిచారు. అయితే దూకుడుగా ఆడిన రస్సెల్ 3 సిక్లర్లు, రెండు ఫోర్లతో 34 పరుగులు చేశాడు. దీంతో కోల్‌కతా స్కోరు 179 పరుగులకు చేరింది.