అహ్మదాబాద్: ఐపిఎల్ సీజన్16లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్ ఐదు వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెన్నైను ఆదుకున్నాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన రుతురాజ్ 50 బంతుల్లోనే 9 భారీ సిక్సర్లు, 4 ఫోర్లతో 92 పరుగులు చేశాడు. మిగతా వారిలో మోయిన్ అలీ (23), శివమ్ దూబే (19) మాత్రమే రాణించారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్ జట్టుకు శుభారంభం అందించారు. ధాటిగా ఆడిన సాహా రెండు సిక్స్‌లు, మరో 2 ఫోర్లతో 25 పరుగులు చేశాడు. మరోవైపు విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించిన గిల్ 36 బంతుల్లోనే ఆరు ఫోర్లు, 3 బౌండరీలతో 63 పరుగలు సాధించాడు. సాయి సుదర్శన్ (22), విజయ్ శంకర్ (27), రాహుల్ తెవాటియా 15 (నాటౌట్) తమవంతు పాత్ర పోషించడంతో గుజరాత్ మరో నాలుగు బంతులు మిగిలివుండగానే మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.