Sunday, November 17, 2024

ఎదురులేని గుజరాత్.. ఢిల్లీపై ఘన విజయం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఐపిఎల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. ఢిల్లీకి ఇది వరుసగా రెండో ఓటమి కాగా, గుజరాత్‌కు రెండో గెలుపు కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 18.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (14), శుభ్‌మన్ గిల్(14)లను అన్రిచ్ నోర్జే క్లీన్ బౌల్డ్ చేశాడు.

ఆ వెంటనే కెప్టెన్ హార్దిక్ పాండ్య(5) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో గుజరాత్ 54 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో సాయి సుదర్శన్, విజయ్ శంకర్‌లు ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. ఇద్దరు జాగ్రత్తగా ఆడుతూ జట్టును లక్షం దిశగా నడిపించారు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన శంకర్ 3 ఫోర్లతో 29 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన డేవిడ్ మిల్లర్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన మిల్లర్ 16 బంతుల్లోనే రెండు సిక్సర్లు, మరో 2 బౌండరీలతో 31 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

ఇక అద్భుత ఇన్నింగ్స్‌ను ఆడిన సాయి సుదర్శన్ 48 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 62 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. దీంతో గుజరాత్ మరో 11 బంతులు మిగిలివుండగానే విజయాన్ని అందుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో గుజరాత్ బౌలర్లు సఫలమయ్యారు. రషీద్ ఖాన్, షమి మూడేసి వికెట్లు తీశారు. జోసెఫ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఢిల్లీ జట్టులో కెప్టెన్ డేవిడ్ వార్నర్(37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతావారిలో సర్ఫరాజ్ ఖాన్(30), అక్షర్ పటేల్(36), అభిషేక్(20) పరుగులు సాధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News