Thursday, January 23, 2025

అదరగొడుతున్న ముంబై ఇండియన్స్.. ప్లేఆఫ్ అవకాశాలు సజీవం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/క్రీడా విభాగం: ఐపిఎల్ సీజన్16లో మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ అదరగొడుతోంది. ఆరంభ మ్యాచుల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ముంబై ఆ తర్వాత వరుస విజయాలతో అలరిస్తోంది. చివరగా జరిగిన రెండు మ్యాచుల్లో ముంబై 200కి పైగా భారీ లక్ష్యాలను అలవోకగా ఛేదించి ఐపిఎల్‌లో పెను ప్రకంపనలు సృష్టించింది. రాజస్థాన్, పంజాబ్‌లతో జరిగిన ఆఖరి మ్యాచుల్లో ముంబై చారిత్రక విజయాలను సొంతం చేసుకుంది. ఈ విజయాలు ముంబై ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కెప్టెన్ రోహిత్ శర్మ పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నా ఇతర బ్యాటర్లు అద్భుత ఆటతో జట్టుకు అండగా నిలుస్తున్నారు.

ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లు గాడిలో పడడం ముంబైకి అతి పెద్ద ఊరటగా చెప్పాలి. చివరి రెండు మ్యాచుల్లో సూర్యకుమార్ కళ్లు చెదిరే బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇకపై జరిగే మ్యాచుల్లో కూడా ఇదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో సూర్యకుమార్ ఉన్నాడు. కొంతకాలంగా పేలవమైన ఫామ్‌తో సతమతమైన సూర్య మళ్లీ ఫామ్‌ను అందుకున్నాడు. ఇది ముంబైతో పాటు టీమిండియాకు శుభసూచకంగా చెప్పాలి. ఇషాన్ కిషన్ కూడా జోరుమీదున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఫామ్‌ను అందుకుంటే ఈ సీజన్‌లో ముంబైకి తిరుగే ఉండదు. మరోవైపు తిలక్ వర్మ, టిమ్ డేవిడ్‌లు కూడా బ్యాట్‌తో అదరగొడుతున్నారు. రాజస్థాన్, పంజాబ్‌లతో జరిగిన మ్యాచుల్లో వీరిద్దరూ అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోయారు. ఇకపై జరిగే మ్యాచుల్లో వీరు జట్టుకు కీలకంగా మారారు.

ప్లేఆఫ్ అవకాశాలు సజీవం
వరుస విజయాలతో జోరుమీదున్న ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఐదింటిలో విజయాలు సాధించింది. ఇకపై జరిగే మ్యాచుల్లో కూడా విజయాలు సాధించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. కీలక ఆటగాళ్లందరూ ఫామ్‌లోకి రావడంతో ముంబైకి రానున్న మ్యాచుల్లో విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న ముంబై ఈసారి ప్లేఆఫ్‌కు చేరే అవకాశాలు అధికంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా గాడిలో పడితే రానున్న మ్యాచుల్లో ముంబైకి తిరగుండదు. పంజాబ్, రాజస్థాన్, చెన్నై, లక్నో, గుజరాత్, చెన్నై తదితర జట్లతో ముంబైకి తీవ్ర పోటీ నెలకొంది. ఇందులో ముంబై ఎంత వరకు సఫలమవుతుందనేది వేచి చూడాల్సిందే.

Also Read: రెజ్లర్లతో అర్థరాత్రి పోలీసు బలగాల కుస్తీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News