Thursday, December 19, 2024

ఇరు జట్లకు కీలకమే.. నేడు ముంబైతో లక్నో పోరు

- Advertisement -
- Advertisement -

లక్నో: ఐపిఎల్ లీగ్ దశ పోటీలు ముగింపు దశకు చేరుకున్నాయి. దీంతో ప్లేఆఫ్‌కు చేరుకునే జట్లపై ఉత్కంఠ నెలకొంది. మంగళవారం జరిగే కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో లక్నో సూపర్‌జెయింట్స్ తలపడనుంది. లక్నో వేదికగా జరిగే ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకంగా మారింది. ఐపిఎల్ సీజన్16లో ఇటు ముంబై అటు లక్నో నిలకడైన ప్రదర్శనతో అలరిస్తున్నాయి. ఆరంభంలోనే వరుస ఓటములు చవిచూసిన ముంబై ఇండియన్స్ కీలక దశలో పుంజుకుంది. అనూహ్య విజయాలతో పాయింట్ల పట్టికలో ఏకంగా మూడో స్థానానికి చేరుకుంది. ఇక లక్నో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు ప్లేఆఫ్ అవకాశాలు మరింత మెరుగుపడుతాయి. దీంతో ఇటు లక్నో అటు ముంబై పోరును సవాల్‌గా తీసుకున్నాయి. ముంబై పెద్ద పెద్ద లక్ష్యాలను అలవోకగా ఛేదిస్తూ పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. కిందటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ వంటి బలమైన జట్టును సయితం చిత్తుగా ఓడించింది.

ఈ మ్యాచ్‌లో కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ముంబై సమతూకంగా కనిపిస్తోంది. డాషింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసక ఇన్నింగ్స్‌లతో చెలరేగి పోతున్నాడు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. కిందటి మ్యాచ్‌లో సూర్యకుమార్ అజేయ శతకంతో కదంతొక్కాడు. లక్నోపై కూడా భారీ స్కోరు సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇషాన్ కిషన్, నెహాల్ వధెరా, రోహిత్ శర్మ, టిమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్, విష్ణు తదితరులతో ముంబై బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. బెహ్రాన్‌డార్ఫ్, చావ్లా, జోర్డాన్, గ్రీన్‌లతో బౌలింగ్ కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో ముంబైకే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

తక్కువ అంచనా వేయలేం..
మరోవైపు లక్నో సూపర్‌జెయింట్స్‌ను తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. విధ్వంసక బ్యాటర్లకు ఆ జట్టులో కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. క్వింటన్ డికాక్ చేరడంతో జట్టు బ్యాటింగ్ మరింత బలోపేతంగా మారింది. కైల్ మేయర్స్ కూడా జోరుమీదున్నాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో టాపార్డర్ అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచింది. మేయర్స్ తప్ప ప్రతి బ్యాటర్ తనవంతు పాత్ర పోషించాడు. డికాక్, ప్రేరక్ మన్కడ్, స్టోయినిస్ తదితరులు విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించారు. ఇక నికోలస్ పూరస్ సునామీ ఇన్నింగ్స్‌తో చెలరేగి పోయాడు. 13 బంతుల్లోనే అజేయగా 44 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లోనూ చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాడు. కెప్టెన్ కృనాల్ పాండ్య ఇటు బంతితో అటు బ్యాట్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా జట్టును ముందుండి నడిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. రవిబిష్ణోయ్, అమిత్ మిశ్రా, అవేశ్ ఖాన్ తదితరులతో లక్నో బౌలింగ్ కూడా బలంగా ఉంది. దీంతో లక్నో కూడా భారీ ఆశలతో మ్యాచ్‌కు సిద్ధమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News