Monday, December 23, 2024

ఇరు జట్లకు కీలకమే.. నేడు ముంబైతో బెంగళూరు ఢీ

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐపిఎల్‌లో భాగంగా మంగళవారం జరిగే కీలక మ్యాచ్‌లో మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారాయి. ఇప్పటి వరకు రెండు జట్లు చెరో ఐదు విజయాలు సాధించాయి. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానాన్ని సాధిస్తోంది. ఇలాంటి స్థితిలో ఇటు ముంబై అటు బెంగళూరు ఈ పోరును సవాల్‌గా తీసుకున్నాయి. రెండు జట్లు కూడా తమ కిందటి మ్యాచుల్లో ఓటమి పాలు కావడంతో ఈ పోరు కీలకంగా మారింది. ఢిల్లీ చేతిలో బెంగళూరు, చెన్నై చేతిలో ముంబై పరాజయం చవిచూశాయి. కానీ వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలనే పట్టుదలతో ఇరు జట్లు ఉన్నాయి. రెండు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే క్రికెటర్లు జట్లలో ఉన్నారు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.

తేలికేం కాదు..
ఇక బెంగళూరు వంటి బలమైన జట్టుతో పోరు ముంబైకి సవాల్‌గా తయారైంది. స్టార్ ఆటగాళ్లతో నిండిన ఛాలెంజర్స్‌ను ఓడించాలంటే ముంబై అసాధారణ ఆటను కనబరచక తప్పదు. కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ జట్టును కలవరానికి గురి చేస్తోంది. ఈ సీజన్‌లో రోహిత్ పేలవమైన ఫామ్‌తో నిరాశ పరుస్తున్నాడు. రోహిత్ వైఫల్యం ముంబైకి ప్రతికూలంగా మారింది. అయితే మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ ఫామ్‌లో ఉండడం ఇండియన్స్‌కు కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. సూర్యకుమార్ యాదవ్, కామెరూన్ గ్రీన్, స్టబ్స్, నెహాల్ వధెరా, టిమ్ డేవిడ్ తదితరులతో ముంబై బ్యాటింగ్ బలంగానే ఉంది. కానీ నిలకడలేమీ జట్టుకు సమస్యగా మారింది. ఈ మ్యాచ్‌లోనైనా బ్యాటింగ్, బౌలింగ్‌లలో సమష్టిగా రాణించాల్సిన బాధ్యత జట్టు ఆటగాళ్లపై ఉంది. లేకుంటే ముంబైకి ఈ మ్యాచ్‌లో గెలవడం కష్టమే.

ఫేవరెట్‌గా ఛాలెంజర్స్..
మరోవైపు ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ముంబైతో పోల్చితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బెంగళూరు సమతూకంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు కొదవలేదు. విరాట్ కోహ్లి, డుప్లెసిస్, మాక్స్‌వెల్, లోమ్రోర్, దినేశ్ కార్తీక్ తదితరులతో బెంగళూరు బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. సిరాజ్, హర్షల్, హాజిల్‌వుడ్, మాక్స్‌వెల్, కర్ణ్‌శర్మ, హసరంగాలతో బౌలింగ్ కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో బెంగళూరుకే కాస్త మెరుగైన అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News