Monday, December 23, 2024

ముంబైకి చావో రేవో… నేడు రాజస్థాన్‌తో ఢీ

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు ముంబై ఇండియన్స్ సిద్ధమైంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైన ముంబైకి ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా బలంగా ఉన్న రాయల్స్‌ను ఓడించాలంటే ముంబై సర్వం ఒడ్డి పోరాడక తప్పలేదు. ఈ సీజన్‌లో ముంబై తన స్థాయికి తగ్గ ఆటను కనబరచ లేక పోతోంది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవలం మూడింటిలో మాత్రమే విజయం సాధించింది. ఇక రాజస్థాన్ ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఈ మ్యాచ్‌లోనూ గెలిచి అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని భావిస్తోంది. ముంబై కూడా గెలుపుపై కన్నేసింది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్‌వర్మ, టిమ్ డేవిడ్ తదితరులతో ముంబై బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అయితే సమష్టిగా రాణించడంలో బ్యాటర్లు విఫలమవుతున్నారు. ఇది ముంబైకి ప్రతికూలంగా మారింది. ఇకపై జరిగే మ్యాచుల్లోనైనా బ్యాటర్లు తమ బ్యాట్‌కు పనిచెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ముంబైకి గెలుపు అవకాశాలు అధికంగా ఉంటాయి. లేకుంటే మరో ఓటమి ఖాయం.

జోరుమీదున్న రాయల్స్..
ఇక రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాలతో జోరుమీదుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సంజు శాంసన్ సేన సమతూకంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్లు జోరుమీదున్నారు. కెప్టెన్ శాంసన్, హెట్‌మెయిర్, హోల్డర్, పడిక్కల్, ధ్రువ్ జురేల్, అశ్విన్‌లతో బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేగాక సందీప్ శర్మ, అశ్విన్, చాహల్, హోల్డర్, కుల్దీప్‌లతో బౌలింగ్ కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. ఆడమ్ జంపా కిందటి మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్‌ను కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్న రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News