మొహాలి: ఐపిఎల్‌లో భాగంగా శుక్రవారం జరిగే కీలక పోరులో లక్నో సూపర్‌జెయింట్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకమనే చెప్పాలి. ప్రస్తుతం రెండు జట్లు నాలుగేసి విజయాలు సాధించాయి. అయితే మెరుగైన రన్‌రేట్ సాధించిన లక్నో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిస్తే పంజాబ్ పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానానికి చేరుకుంటుంది. పంజాబ్‌తో పోల్చితే లక్నో చాలా బలంగా ఉందనే చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో లక్నో పటిష్టంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. అయితే గుజరాత్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో లక్నో 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సయితం ఛేదించలేక పోయింది. ఇది లక్నో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అంశమే.
లక్నోలో జరిగిన ఆ మ్యాచ్‌లో బౌలర్లు అద్భుతంగా రాణించి బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన గుజరాత్‌ను 135 పరుగులకే పరిమితం చేశారు. అయితే బ్యాటింగ్ వైఫల్యంతో లక్నోకు ఆ మ్యాచ్‌లో ఓటమి తప్పలేదు. ఇలాంటి స్థితిలో పంజాబ్‌తో జరిగే మ్యాచ్ లక్నోకు సవాల్ వంటిదేనని చెప్పడంలో సందేహం లేదు. కిందటి మ్యాచ్‌లో ముంబై వంటి బలమైన జట్టును ఓడించడంతో పంజాబ్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఈ పరిస్థితుల్లో పంజాబ్‌ను ఓడించాలంటే లక్నో అసాధారణ బ్యాటింగ్‌ను కనబరచక తప్పదు. ఈ మ్యాచ్‌లో కూడా లక్నో కెప్టెన్ కెఎల్ రాహుల్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సీజన్‌లో రాహుల్ అసాధారణ బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. కిందటి మ్యాచ్‌లో కూడా రాహుల్ అర్ధ సెంచరీతో మెరిశాడు. ఈసారి కూడా జట్టు ఆశలన్నీ రాహుల్‌పైనే నిలిచాయి. మరో ఓపెనర్ కైల్ మేయర్స్ కూడా జోరుమీదున్నాడు. ఈ సీజన్‌లో మేయర్స్ విధ్వంసక ఇన్నింగ్స్‌లతో లక్నో విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. పంజాబ్‌పై కూడా చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాడు.
అయితే నికోలస్ పూరన్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. పూరన్ ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లోనే రాణించాడు. మిగతా మ్యాచుల్లో వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. అతని వైఫల్యం లక్నోకు ప్రతికూలంగా మారింది. ఈ మ్యాచ్‌లోనైనా పూరన్ తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచాల్సిన అవసరం ఉంది. పూరన్ విజృంభిస్తే లక్నో బ్యాటింగ్ సమస్యలు చాలా వరకు తీరిపోతాయి. కృనాల్ పాండ్య, అయూష్ బడోని, స్టోయినిస్ వంటి దూకుడైన బ్యాటర్లు లక్నోకు అందుబాటులో ఉన్నారు. ఇదిలావుంటే దీపక్ హూడా ఈ సీజన్‌లో అత్యంత పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నాడు. భారీ ఆశలు పెట్టుకున్న దీపక్ హుడా ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచుల్లోనూ విఫలమయ్యాడు. టాపార్డర్‌లోనే కాకుండా మిడిలార్డర్, లోయర్ ఆర్డర్‌లలో బ్యాటింగ్‌కు దించిన ఫలితం లేకుండా పోతోంది. మిగిలిన మ్యాచుల్లోనైనా హుడా రాణిస్తాడా లేదా అనేది సందేహంగా మారింది.
భారీ ఆశలతో పంజాబ్ కింగ్స్
మరోవైపు ఆతిథ్య పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది. కిందటి మ్యాచ్‌లో ముంబైను ఓడించడంతో పంజాబ్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. లక్నో మ్యాచ్‌లోనూ విజయం సాధించి ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకోవాలని పంజాబ్ భావిస్తోంది. మాథ్యూ షార్ట్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, లివింగ్‌స్టోన్, హర్‌ప్రీత్ సింగ్, సామ్ కరన్, జితేష్ శర్మ, షారుక్ ఖాన్ తదితరులతో పంజాబ్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక అర్ష్‌దీప్, రాహుల్ చాహర్, లివింగ్‌స్టోన్, నాథన్ ఎల్లిస్, కరన్‌లతో బౌలింగ్ విభాగం కూడా బాగానే కనిపిస్తోంది. ఇలాంటి స్థితిలో లక్నోతో జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌కు కూడా గెలుపు అవకాశాలు బాగానే ఉన్నాయని చెప్పాలి.