Tuesday, December 24, 2024

జోరుమీదున్న రాజస్థాన్.. నేడు పంజాబ్‌తో పోరు

- Advertisement -
- Advertisement -

గౌహతి: ఐపిఎల్‌లో భాగంగా బుధవారం గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌పంజాబ్ కింగ్స్ మధ్య పోరు జరుగనుంది. ఇరు జట్లు ఇప్పటికే ఆరంభ మ్యాచుల్లో విజయం సాధించి జోరుమీదున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఘన విజయం సాధించింది. మరోవైపు కోల్‌కతాతో జరిగిన పోరులో పంజాబ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో జయకేతనం ఎగుర వేసింది. ఇక పంజాబ్‌తో పోల్చితే రాజస్థాన్ బలంగా కనిపిస్తోంది.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాజస్థాన్ సమతూకంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే క్రికెటర్లకు జట్టులో కొదవలేదు. యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ వంటి మెరుపు బ్యాటర్లు జట్టులో ఉన్నారు. తొలి మ్యాచ్‌లో బట్లర్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగి పోయాడు. 22 బంతుల్లోనే 54 పరుగులు చేశాడు. యశస్వి, శాంసన్‌లు కూడా కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. దేవ్‌దుత్ పడిక్కల్, రియాన్ పరాగ్, హెట్‌మెయిర్ వంటి హార్డ్ హిట్టర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఈసారి కూడా రాజస్థాన్ తొలుత బ్యాటింగ్ చేస్తే భారీ స్కోరును నమోదు చేయడం ఖాయం. అంతేగాక ట్రెంట్ బౌల్ట్, అశ్విన్, నవ్‌దీప్ సైనీ, చాహల్, హోల్డర్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు ఉండనే ఉన్నారు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చాహల్, బౌల్ట్ అద్భుతంగా రాణించారు. ఆసిఫ్, హోల్డర్, అశ్విన్‌లు కూడా పొదుపుగా బౌలింగ్ చేశారు. ఈసారి కూడా బౌలర్లపై రాజస్థాన్ భారీ ఆశలు పెట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్న రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో కూడా గెలుపే లక్షంగా పెట్టుకుంది. బట్లర్, యశస్వి, శాంసన్, హెట్‌మెయిర్‌లు తమ మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే పంజాబ్ బౌలర్లకు కష్టాలు తప్పక పోవచ్చు. హైదరాబాద్ వంటి బలమైన జట్టును వారి సొంత గడ్డపైనే చిత్తుగా ఓడించడంతో రాజస్థాన్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. దీంతో పంజాబ్‌తో పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది.

తక్కువ అంచనా వేయలేం..
మరోవైపు పంజాబ్‌ను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పంజాబ్ కూడా బలంగానే ఉంది. కెప్టెన్ శిఖర్ ధావన్, రాజపక్స, సికందర్ రజా, శామ్ కరన్, షారూఖ్ ఖాన్, నాథన్ ఎల్లిస్ వంటి స్టార్ బ్యాటర్లు జట్టులో ఉన్నారు. ధావన్, రాజపక్సలు తొలి మ్యాచ్‌లో మెరుగైన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా జట్టు వీరిపై భారీ ఆశలు పెట్టుకుంది. అంతేగాక శామ్ కరన్, అర్ష్‌దీప్, ఎల్లిస్, రజా, రాహుల్ చాహర్ తదితరులతో పంజాబ్ బౌలింగ్ కూడా బాగానే ఉంది. దీనికి తోడు తొలి మ్యాచ్‌లో కోల్‌కతా వంటి బలమైన జట్టుపై గెలవడంతో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌లో పంజాబ్‌కు కూడా గెలుపు అవకాశాలు సమంగానే ఉన్నాయని చెప్పక తప్పదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News