Friday, December 20, 2024

సన్‌రైజర్స్‌కు ప్లేఆఫ్ కష్టమేనా..!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: వరుస ఓటములతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో ప్లేఆఫ్‌కు చేరడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు పది మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ కేవలం నాలుగింటిలో మాత్రమే విజయం సాధించింది. ఆరు మ్యాచుల్లో పరాజయం చవిచూసింది. లీగ్ దశలో సన్‌రైజర్స్ లీగ్ దశలో మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే హైదరాబాద్ తలపడబోయే జట్లన్నీ బలమైనవే కావడంతో వీటిని ఓడించడం అనుకున్నంత తేలికేం కాదు.

లక్నో సూపర్‌జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌లతో హైదరాబాద్ తలపడాల్సి ఉంది. ఈ సీజన్‌లో లక్నో, గుజరాత్, ముంబై, బెంగళూరు అద్భుత ఆటతో అలరిస్తున్నాయి. ఇలాంటి స్థితిలో ఈ జట్లతో పోరు సన్‌రైజర్స్‌కు సవాల్ వంటిదేనని చెప్పాలి. ఈ జట్లతో పోల్చితే పాయింట్ల పట్టికలో హైదరాబాద్ చాలా వెనుకబడి ఉంది. గుజరాత్ ఇప్పటికే ప్లేఆఫ్‌కు చేరువైంది. లక్నోకు కూడా అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. ముంబై, బెంగళూరు జట్లు కూడా పాయింట్ల పట్టికలో హైదరాబాద్ కంటే మెరుగైన స్థానంలో ఉన్నాయి.

సవాల్ వంటిదే..
ఇకపై జరిగే నాలుగు మ్యాచ్‌లు కూడా సన్‌రైజర్స్‌కు సవాల్ వంటిదేనని చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఈ జట్లు చాలా బలంగా ఉండడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పాలి. గుజరాత్, లక్నోలు అసాధారణ ఆటతో అదరగొడుతున్నాయి. ముంబై. బెంగళూరు కూడా జోరుమీదున్నాయి. మరోవైపు హైదరాబాద్‌ను ఈ సీజన్‌లో బ్యాటింగ్ సమస్య వెంటాడుతోంది. కీలక ఆటగాళ్ల వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. హ్యారి బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి తదితరులు చెత్త బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నారు. బ్రూక్ ఈ సీజన్లో ఒక్క సెంచరీ మినహా ఒక్క మ్యాచ్‌లో కూడా సత్తా చాటలేక పోయాడు. కోట్లాది రూపాయలు వెచ్చించి సొంతం చేసుకున్నా బ్రూక్ మాత్రం చెత్త ఆటతో ఇటు యజమాన్యాన్ని అటు అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాడు.

జట్టుకు అండగా నిలుస్తారని భావించిన రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్‌లు కూడా పేలవమైన బ్యాటింగ్‌తో సతమతమవుతున్నారు. కిందటి సీజన్‌లో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న రాహుల్ త్రిపాఠి ఈసారి మాత్రం ఆ జోరును కొనసాగించేలక పోతున్నాడు. మయాంక్ కూడా పూర్తిగా విఫలమయ్యాడు. కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ కూడా జట్టును ముందుండి నడిపించలేక పోతున్నాడు. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా మార్‌క్రమ్ పెద్దగా ప్రభావం చూపలేక పోతున్నాడు. అబ్దుల్ సమద్ కూడా పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తున్నాడు. బౌలర్లు కాస్త బాగానే రాణిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ఇప్పటికే ఆరు మ్యాచుల్లో ఓటమి పాలైన సన్‌రైజర్స్‌కు మిగిలిన మ్యాచ్‌లు చాలా కీలకంగా మారాయి. ఈ మ్యాచుల్లో భారీ తేడాతో విజయం సాధంచడమే కాకుండా రన్‌రేల్‌ను మెరుగు పరుచుకోక తప్పదు.

ఒకవేళ అన్ని మ్యాచుల్లో గెలిచినా ప్లేఆఫ్ బెర్త్ కోసం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి సన్‌రైజర్స్‌కు నెలకొంది. ఇదిలావుంటే హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. శనివారం మధ్యాహ్నం లక్నోతో సన్‌రైజర్స్ తలపడనుంది. ఇక మే 15న అహ్మదాబాద్‌లో గుజరాత్‌తో, మే 18న ఉప్పల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో హైదరాబాద్ పోటీ పడనుంది. ఇక మే 21 చివరి మ్యాచ్‌లో ముంబైని ఎదుర్కొంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News