Wednesday, January 22, 2025

బెంగళూరుకు కీలకం.. నేడు పంజాబ్‌తో పోరు

- Advertisement -
- Advertisement -

మొహాలీ: ఐపిఎల్‌లో భాగంగా గురువారం జరిగే కీలక మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. ప్లేఆఫ్ అవకాశాలను మెరుగు పరుచుకోవాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ కీలకమే. ఇలాంటి స్థితిలో పంజాబ్‌తో జరిగే మ్యాచ్ బెంగళూరుకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందాలనే పట్టుదలతో బెంగళూరు ఉంది. ఇక పంజాబ్ కూడా విజయంపై కన్నేసింది.

ఇప్పటికే మూడు మ్యాచుల్లో విజయం సాధించిన పంజాబ్ ఇకపై జరిగే పోటీల్లో మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తోంది. బెంగళూరుతో పోల్చితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పంజాబ్ కాస్త వెనుకబడే ఉందని చెప్పాలి. అయితే కిందటి మ్యాచ్‌లో లక్నో వంటి బలమైన జట్టును ఓడించడంతో పంజాబ్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకోవాలని భావిస్తోంది.

ఫేవరెట్‌గా బరిలోకి..
ఇక ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బెంగళూరు సమతూకంగా కనిపిస్తోంది. చెన్నైతో జరిగిన కిందటి మ్యాచ్‌లో ఛాలెంజర్స్ పోరాడి ఓడింది. కెప్టెన్ డుప్లెసిస్, మాక్స్‌వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు. అయితే కీలక సమయంలో వికెట్లు కోల్పోవడంతో బెంగళూరుకు ఓటమి తప్పలేదు. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఆడాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. విరాట్ కోహ్లి, డుప్లెసిస్, మాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, పర్నెల్, సిరాజ్, హసరంగా వంటి మ్యాచ్ విన్నర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. ఈ సీజన్‌లో కోహ్లి, డుప్లెసిస్, మాక్స్‌వెల్ తదితరులు అద్భుత ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. సిరాజ్ కూడా బంతితో సత్తా చాటుతున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో బెంగళూరుకే గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయని చెప్పాలి.

విజయమే లక్షంగా..
మరోవైపు పంజాబ్ కూడా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది. లక్నోతో జరిగిన కిందటి మ్యాచ్‌లో పంజాబ్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. సికందర్ రజా ఫామ్‌లోకి రావడం జట్టుకు శుభసూచకంగా చెప్పాలి. కిందటి మ్యాచ్‌కు దూరంగా ఉన్న కెప్టెన్ శిఖర్ ఈసారి బరిలోకి దిగే అవకాశాలున్నాయి. సామ్ కరన్, మాథ్యూ షార్ట్, ప్రభుసిమ్రాన్ సింగ్, జితేశ్ శర్మ, రబడా తదితరులతో పంజాబ్ బలంగా ఉంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News